Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ కదలికలు.. గుర్తించిన చెన్నై టెక్కీ షణ్ముగం

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ కదలికలు.. గుర్తించిన చెన్నై టెక్కీ షణ్ముగం
, సోమవారం, 3 ఆగస్టు 2020 (07:37 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్-2. ఈ ప్రాజెక్టు విజయవంతం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఆఖరు నిమిషం వరకు శాయశక్తులా కృషిచేశారు. అయితే, చివరి క్షణంలో ఈ ప్రాజెక్టు విఫలమైంది. స్థిరంగా, నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని బలంగా గుద్దుకుంది. దీంతో విక్రమ్ ల్యాండర్ నుంచి రావాల్సిన సంకేతాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ శకలాలను చెన్నైకు చెందిన షణ్ముగ సుబ్రమణియన్ అనే టెక్కీ నాసా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. 
 
ఇప్పుడా షణ్ముగ సుబ్రమణియన్ మరోసారి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై కొంత మేర కదిలినట్టు నాసా తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్టుగా భావిస్తున్న బిలం నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని మీటర్లు ముందుకు కదిలినట్టు నాసా చిత్రాల్లో కనిపిస్తోంది ఆయన వెల్లడించారు. 
 
టెక్కీ షణ్ముగం ఇచ్చిన సమాచారంపై ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్పందించారు. 'దీనిపై నాసా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందించలేదు. కానీ విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన ఈ వ్యక్తి నుంచి మాకు ప్రజ్ఞాన్ రోవర్ గురించి తాజాగా ఈమెయిల్ సమాచారం వచ్చింది. మా నిపుణులు ఆ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాని గురించి ఏమీ చెప్పలేం' అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంమీద టెక్కీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇపుడు విక్రమ్ ల్యాండర్‌పై కొత్త ఆశలురేపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లంతో కరోనావైరస్ చచ్చిపోతుందా?