కన్నబిడ్డనే తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టాడు. చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ కు తమ పదేళ్ల కూతురును రూ.10 లక్షలకు అమ్మిన తల్లిదండ్రులను సేలం పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలికను దత్తత తీసుకోకుండా అక్రమ పద్ధతుల్లో కొనుగోలు చేసిన పారిశ్రామికవేత్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సేలం అన్నాదానపట్టిలో సతీష్‌కుమార్(30), సుమతి (26) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది.
సుమతి కొన్నేళ్ల క్రితం చెన్నైలో ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని కృష్ణన్ ఇంటిలో పనిమనిషిగా వుండేది. ఆ తర్వాత ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్లింది. ఆ తర్వాత కృష్ణన్ మనస్పర్థల కారణంగా భార్యను విడిచిపెట్టి ఒంటరిగా గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సుమతి తన కుమార్తెను రూ.10 లక్షలకు కృష్ణన్‌కు అమ్మేసింది. అయితే సుమతి తల్లి చిన్నపొన్ను ఈ విషయాన్ని పసిగట్టింది. కొద్ది రోజులుగా తన మనమరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపడంతో అసలు గుట్టు రట్టయ్యింది. బాలికను అమ్మిన సుమతి, సతీష్‌కుమార్‌ను, పారిశ్రామికవేత్త కృష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు.