పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. కానీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం టెన్త్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించింది. పరీక్షలు అర్థాంతరంగా ఆగిపోవడంతో అందరిని పాస్ చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని భావించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా దగ్గర పడుతోందని అందుకే ఈ నిర్ణం తీసుకున్నట్లు ఛత్తీస్‌ఘడ్ అధికారులు తెలిపారు. అప్పట్లో ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయకపోయినా కూడా సాధారణ మార్కులతో పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులను సూచించింది. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా అందరినీ పాస్ చేసి పై తరగతులకు పంపాలని అధికారులను ఆదేశించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. దీంతో అక్కడి విద్యార్థులు తెగ సంబరపడిపోతున్నారు. ఎగరిగంతేస్తున్నారు.