కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపినందుకు కేంద్రం తమను శిక్షిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదివారం హర్యానా రాష్ట్రంలోని జింద్‌లో కిసాన్ మహాపంచాయతీని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. అంతకుముందు రైతుల నిరసన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నందునే వారికి మద్దతుగా నిలిచామని కేజ్రీవాల్ చెప్పారు.
కేజ్రీవాల్‌ను శిక్షించాలన్న ఏకైక లక్ష్యంతో వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు మేం ప్రతిఫలాలను ఎదుర్కొన్నాం. వారు బిల్లును ఆమోదించడం ద్వారా, ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి అధికారాన్ని అప్పగించడం ద్వారా వారు మాకు శిక్ష వేస్తున్నారు. దీని కోసం స్వాతంత్ర్య పోరాటం చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.
ఆందోళన సమయంలో మరణించిన 300 మంది త్యాగాలకు వందనం చేస్తున్నామని, వారి త్యాగం వృధాకాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉన్నదని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా రైతులు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.