ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సంక్షోభంలో కూరుకుంది. దీంతో ఆ సంస్థకు చెందిన అనేక విమానయాలు రద్దు అవుతున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న కొన్ని విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రయాణ చార్జీలను పెంచేశాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. దీన్ని పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ అవకాశవాద ధరల పెంపు విషయం తన దృష్టికి రావడంతో శనివారం కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
'అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ తరహా అవకాశవాద ప్రవర్తన నుంచి ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత మార్గాల్లో న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ధరించేందుకు మంత్రిత్వశాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుంది. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునేవరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్యసహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, దోపిడీని నిరోధించాల్సిన అవసరం ఉంది' అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అలాగే, పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను వెంటనే చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రద్దయిన, ఆలస్యమవుతోన్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటల కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని వెల్లడించింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.