Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశు వధపై బ్రహ్మాస్త్రం.. పశువులను ఎలా చంపుతారో చూస్తాం...

పశువుల క్రయవిక్రయాలపై పలు నిబంధనలు విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశ వ్యాప్తంగా జంతు మాంస పరిశ్రమపై పెను ప్రభావం చూపే ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. పశువుల విక్రయం

పశు వధపై బ్రహ్మాస్త్రం.. పశువులను ఎలా చంపుతారో చూస్తాం...
హైదరాబాద్ , శనివారం, 27 మే 2017 (05:41 IST)
పశువుల క్రయవిక్రయాలపై పలు నిబంధనలు విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశ వ్యాప్తంగా జంతు మాంస పరిశ్రమపై పెను ప్రభావం చూపే ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా కొనుగోలు దారుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ‘దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కబేళాల కోసం ఆవులు (వయసులో ఉన్నవి, దూడలు సహా), గేదెలు, ఎద్దులు, ఒంటెల్ని అమ్మడం, కొనడం నిషేధం. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం–2017(పశువుల సంతల నియంత్రణ)లోని నిబంధనల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేస్తున్నాం. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి’ అని పర్యావరణ శాఖ స్పష్టంచేసింది. 
 
కేంద్రం తీసుకువచ్చిన నూతన నిబంధన ప్రకారం వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలి.  ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక కేంద్రం స్థాయిలో గోసంరక్షణపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. పశు విక్రేతలపై ప్రత్యేకించి ముస్లింలపై హిందూత్వ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.

ఏప్రిల్ 1న హర్యానాకి చెందిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్‌పై రాజస్థాన్‌లో గోసంరక్షకులు దాడి చేసి చంపేశారు. నెలరోజుల క్రితం అసోంలో వధకోసం ఆవులను తరలిస్తున్నారంటూ ఇద్దరిని కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ‘జంతు హింస నియంత్రణ చట్టం 1960’ కింద గురువారం నూతన నిబంధనలు నోటిఫై చేసినట్టు సమాచారం.
 
‘‘వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను కొనుగోలు చేయాలి... వధించడం కోసం కాదు’’ అని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కొనుగోలు చేసిన ఆరు నెలల వరకు మళ్లీ అమ్మకూడదని షరతులు కూడా విధించడం పశువిక్రేతలకు చెక్ పెట్టేలా ఉంది. తాను ‘‘సేద్యకారుడిని’’ అని సరైన ధ్రువపత్రాలు చూపిస్తేనే ఇకపై ఆవులను విక్రయించాల్సి ఉంటుంది. 8 పేజీల మేర పలు నిబంధనలు రూపొందించిన కేంద్ర పర్యావరణ శాఖ... లేగదూడలు, పనిచేయలేని పశువులను విక్రయించకూడదని కూడా స్పష్టం చేసింది. 
 
కేంద్రం నిర్ణయంతో దేశంలోని రూ.లక్ష కోట్ల విలువైన జంతు మాంసం, దాని అనుబంధ ఉత్పత్తుల మార్కెట్లపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఆ మార్కెట్లకు అవసరమైన 90 శాతం ముడిసరుకు పశువుల సంతల నుంచే సరఫరా అవుతోంది. ఈ కొత్త నిబంధనలు పశువుల సంతల్లో ఎక్కువ లావాదేవీలు జరిపే ముస్లిం వర్తకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న, ఉపయోగం లేని పశువుల అమ్మకంతో వచ్చే ఆదాయం మార్గం కోల్పోవడం వల్ల రైతులు కూడా ప్రభావితం అవుతారని భావిస్తున్నారు. 
 
పశువుల వర్తకుల్లో ఎక్కువ శాతం పేదలు, నిరక్షరాస్యులేనని, కొత్త నిబంధనలతో ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం తలకు మించిన భారమేనన్నది కొందరు నిపుణుల అంచనా. ప్రభుత్వ నిర్ణయంలో మంచి చెడులను అలా పక్కనబెడితే పశువులను కొనడం, అమ్మడం కూడా ఇకపై అసాధ్యం అవుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా దీనిపై గగ్గోలు బయలుదేరింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన తాజ్‌కు మరో ప్రమోషన్.. ప్రపంచ కట్టడాల్లో అయిదు, ఆసియా కట్టడాల్లో రెండో స్థానం... దిగజారిన గ్రేట్ వాల్