Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.805 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.. జీవీకే గ్రూపు అధిపతిపై కేసు

Advertiesment
రూ.805 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.. జీవీకే గ్రూపు అధిపతిపై కేసు
, గురువారం, 2 జులై 2020 (10:44 IST)
ముంబై విమానాశ్రయం అభివృద్ధి పనులలో రూ.805 కోట్ల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అభియోగాల నేపథ్యంలో జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జి.వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పేర్లను, కొన్ని ప్రైవేటు సంస్థలకు చెందిన 9 మంది ఇతరుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది.
 
సీబీఐ తయారు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆరేళ్ల వ్యవధిలో వీరంతా కలిసి రూ.805 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొన్ని ఇతర విదేశీ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్‌గా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)ను ప్రారంభించగా, జీవీకేకు 50.5 శాతం, ఏఏఐకి 26 శాతం వాటాలు వున్నాయి. 
 
ఇక ఈ కేసులో జీవీకే రెడ్డితో పాటు ఎంఐఏఎల్ ఎండీగా ఉన్న జీవీ సంజయ్ రెడ్డిపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 2006లో కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎంఐఏఎల్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తూ, వచ్చిన ఆదాయంలో 38.7 శాతాన్ని ఏఏఐకి వార్షిక ఫీజుగా చెల్లించాలి. మిగతా ఆదాయంతో విమానాశ్రయాన్ని ఆధునికీకరించడం, కార్యకలాపాల నిర్వహణకు వినియోగించుకోవాలి. 
 
అయితే, ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు 9 ప్రైవేటు కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా రూ.310 కోట్ల నిధిని పక్కదారి పట్టించారు. విమానాశ్రయం చుట్టుపక్కల అభివృద్ధికి నోచుకోని దాదాపు 200 ఎకరాల భూమిలో నిర్మాణ రంగ కార్యకలాపాలు చేపట్టేందుకంటూ నిధులను మళ్లించారని సీబీఐ వెల్లడించింది.
 
జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించింది. ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ.395 కోట్ల అదనపు మూలధనాన్ని 2012 నుంచి 2018 మధ్య జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని, జాయింట్ వెంచర్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. 
 
జీవీకే గ్రూప్ ప్రమోటర్ల కారణంగా రూ.805 కోట్ల నష్టం వాటిల్లిందని, విచారణ తర్వాత మొత్తం నష్టం రూ.1000 కోట్లను దాటిపోతుందని అంచనా వేస్తున్నామని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకే జీవీకే సంస్థల అధిపతులపై కేసు నమోదు చేయడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా ఉధృతి - ఆరు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు