Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేతన జీవులకు శుభవార్త... ఆదాయపన్ను పరిమితిని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు!!

income tax

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (11:12 IST)
దేశంలోని వేతన జీవులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. త్వరలోనే ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి కొత్త బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితిని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ మేరకు కేంద్ర అధికార వర్గాలు సంకేతాలు పంపించాయి. కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 
 
ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కిందిస్థాయి శ్లాబుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడంకన్నా, మధ్య తరగతి వర్గం ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేటట్లు చూసి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదా అయిన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరికొటి ముడిపడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. 
 
ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉంటే 5 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంది. అది శ్లాబుల వారీగా పెరుగుతుంది. ఆదాయం రూ.15 లక్షలకు చేరుకుంటే పన్ను 30 శాతం పెరుగుతుంది. ఆదాయం ఐదు రెట్లు పెరిగితే పన్ను శ్లాబు మాత్రం ఆరు రెట్లు పెరుగుతోంది. ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని, శ్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జులైలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌పై ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో మంగళవారం చర్చలు జరపనున్నారు. ఈ నెల 20న పారిశ్రామిక వర్గాలతో సమావేశమై వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలను జులై ఒకటో తేదీ నుంచే అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ వెల్లడించారు. ఈ విషయంలో పునరాలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కేంద్ర కొత్త క్రివినల్ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈవీఎంలను హ్యాక్ చేసి టీడీపీ గెలిచిందా? ఎన్నికలను రద్దు చేస్తే..?