ఖగోళంలో అద్భుతం జరుగనుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ వింతను చూసే అవకాశం ఉంది.
వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ రక్త చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం.
ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.