Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే హవానా?

Advertiesment
BJP
, ఆదివారం, 14 నవంబరు 2021 (09:28 IST)
ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీశాయి. కానీ, వచ్చే యేడాది జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉందని ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్ఎస్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
 
మొత్తం ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని పేర్కొంది. ఒక్క పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో 1,07,193 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.
 
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. మొత్తం 403 స్థానాలున్న యూపీలో బీజేపీ 40.7 శాతం ఓట్లతో 217 సీట్లు సాధిస్తుందని తెలిపింది. అయితే, ఈసారి 108 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీకి కోల్పోతుందని వివరించింది.  ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎస్పీ, బీజేపీ మధ్యే ఉంటుందని, ఎస్పీ 31.1 శాతం ఓట్లతో 156 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
అలాగే, 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి స్థానాలు తగ్గుతాయని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ మార్కును దాటుతుందని పేర్కొంది. గత ఎన్నికల్లో 57 సీట్లు సాధించగా, ఈసారి వాటి సంఖ్య 38కి పడిపోతుందని, కాంగ్రెస్‌కు అదనంగా 21 సీట్లు వస్తాయని, దీంతో దాని బలం 32 స్థానాలకు పెరుగుతుందని వివరించింది.
 
ఇకపోతే, 40 సీట్లున్న గోవాలో బీజేపీకి 21, ఆప్‌కు 5, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కుతాయని, ఇతరులు 10 స్థానాలు దక్కించుకుంటారని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని 60 స్థానాల్లో 27 బీజేపీ ఖాతాలో పడతాయని, కాంగ్రెస్‌కు 22 స్థానాలు వస్తాయని తెలిపింది. 
 
ఇక పంజాబ్‌లో మాత్రం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే అంచనా వేసింది. 117 సీట్లున్న పంజాబ్‌లో ‘ఆప్’ 51 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ 31 స్థానాలను కోల్పోయి 46 సీట్లకు పరిమితం అవుతుందని, అకాలీదళ్ 20 సీట్లతో మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాయుగుండం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ - నేడు రేపు భారీ వర్షాలు