ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉందని అయితే, బలహీనంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ దఫా ఆ పార్టీకి ఐదు లోక్‌సభ సీట్లు వస్తున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, సెఫాలజిస్ట్ సుర్జీత్ భల్లా అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్రంలో కూడా ఒకటి రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎన్డీటీవీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 2019లో సాధించిన ఫలితాలకన్నా మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందన్నారు. బీజేపీకి సొంతంగానే 330 నుంచి 350 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు. '
'గణాంకాల ఆధారంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తే.. వారికి (బీజేపీ) 330 నుంచి 350 సీట్లు సొంతంగానే రావొచ్చు. 2019 ఫలితాలకన్నా 5 నుంచి 7 శాతం ఎక్కువ సీట్లు సాధించొచ్చు' అని సుర్జీత్ భల్లా తెలిపారు. అయితే తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఈసారి కనీసం 5 సీట్లు గెలుచుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అలాగే కేరళలో ఆ పార్టీకి ఒకట్రెండు సీట్లు రావొచ్చన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు లేదా 2014లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకన్నా 2 శాతం తక్కువ సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు.
'విపక్ష కూటమి నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. ప్రతిపక్షం ఒకవేళ సామాన్య ప్రజల్లో ఆదరణగల నాయకుడిని ఎంపిక చేసుకొని ఉండి ఉంటే లేదా ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణలో సగమైనా ఉన్న నేతను సెలక్ట్ చేసి ఉంటే అప్పుడు రెండు కూటముల మధ్య పోటీ ఉండేది' అని భల్లా అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడటం వల్లే బీజేపీకి ఎక్కువ సీట్లు లభించే అవకాశం కనిపిస్తోందని భల్లా అంచనా వేశారు.
'ప్రజల జీవితాల్లో ఎంత మేరకు మార్పు వచ్చిందో దాని ఆధారంగానే భారత్ ఓటేస్తుంది. ఇది ఒక ప్రాథమిక సిద్ధాంతం. అంతేకానీ కులం, లింగభేదం కాదు. అలాగే ప్రజలు ఆపాదించే ఇతర అంశాలు కూడా ఇందుకు కారణం కాదు. దేశ ఆర్థిక రంగమే దీన్ని నిర్దేశిస్తుందని బిల్ క్లింటన్ 1992లోనే చెప్పారు' అని భల్లా అన్నారు. ప్రస్తుతం దేశంలో పేదల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. దేశ జనాభాలో ఒక శాతం లేదా 1.4 కోట్ల మంది పేదలు ఉండటం అనేది పేదరికానికి ఉన్న పాత నిర్వచనమని ఆయన పేర్కొన్నారు. కానీ దేశం అభివృద్ధి చెందిందని.. తలసరి వినియోగం మెరుగుపడిందని చెప్పారు. కాబట్టి దేశ జనాభాలో నాలుగో వంతు పేదలే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.