కర్ణాటక రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ముఖ్యంగా బీదర్ జిల్లాలో ఈ వైరస్ ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ జిల్లాలోని కోళ్ళఫోరంలో ఉన్న కోళ్లను పరీక్షించగా స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 1,30,000 కోళ్లను చంపేసి, పూడ్చిపెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి ఏ మంజు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన 20 వేల కోళ్లు చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఈ కోళ్ళ నుంచి సేకరించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని పరిశోధనాశాలకు పంపించగా, కోళ్ళకు స్వైన్ ఫ్లూ (హెచ్5ఎన్1) సోకినట్టు తేలిందని చెప్పారు. దీంతో మిగిలిన 1.30 లక్షల కోళ్లను చంపి రెండు మూడు రోజుల్లో పూడ్చి పెట్టాల్సిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు.
బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ తాలూకా మొలకేరా అనే గ్రామానికి చెందిన రమేష్ గుప్తా అనే రైతుకు చెందిన కోళ్ళఫోరంలోని కోళ్ళలో బర్డ్‌ఫ్లూను తొలుత గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా చికెన్ విక్రయాలను నిలిపివేసింది.