Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలు మాట్లాడకుండా వెంకయ్య ఇక కంట్రోల్‌గా ఉండగలరా.. పెద్ద పరీక్షే

ఉషాపతిగానే ఉంటాను. రాష్ట్రపతీ వద్దు, ఉపరాష్ట్రపతీ వద్దు అంటూ వెంకయ్యనాయుడు తన సతీమణికి అత్యున్నత పదవులకు మించిన గౌరవం ఇవ్వడం చాలా గొప్ప విషయం. కానీ నాలుగు దశాబ్దాలుగా రాజకీయమే జీవితంగా బతికిన ఈ తెలుగుబిడ్డ ఇక రాజకీయం అనే మాట మర్చిపోవలసి ఉంటుందని, రాజ

రాజకీయాలు మాట్లాడకుండా వెంకయ్య ఇక కంట్రోల్‌గా ఉండగలరా.. పెద్ద పరీక్షే
హైదరాబాద్ , మంగళవారం, 18 జులై 2017 (07:44 IST)
ఉషాపతిగానే ఉంటాను. రాష్ట్రపతీ వద్దు, ఉపరాష్ట్రపతీ వద్దు అంటూ వెంకయ్యనాయుడు తన సతీమణికి అత్యున్నత పదవులకు మించిన గౌరవం ఇవ్వడం చాలా గొప్ప విషయం. కానీ నాలుగు దశాబ్దాలుగా రాజకీయమే జీవితంగా బతికిన ఈ తెలుగుబిడ్డ ఇక రాజకీయం అనే మాట మర్చిపోవలసి ఉంటుందని, రాజ్యసభ ప్రాంగణం వరకే తన వాయిస్‌ని పరిమితం చేసుకోవలసి ఉంటుందని జీవితంలో ఎన్నడూ ఊహించి ఉండరు. 
 
కానీ ఇన్నేళ్ల తర్వాత తనకు ఏమాత్రం ఇష్టం లేని పనికి ఒప్పుకోవలసి వచ్చింది. ఏ మాట తీరు, వాక్చాతుర్యం, కలుపుగోలుతనం,  ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించే ప్రతిభా పాటవం వెంకయ్య రాజకీయ జీవితాన్ని శోభాయమానం చేశాయో అవే గుణాలు ఆయనను ఉపరాష్ట్రపతి పదవి వైపుకు నెట్టాయి. రాజ్యసభలో ప్రభుత్వ బిల్లులను  పాస్ చేయించడంలో, ప్రతిపక్షాలను ఒప్పించడంలో వెంకయ్య కంటే మించిన ప్రతిభాశాలి మరొకరు లేరన్న ఎరుకే మోదీ, అమిత్ షాలను శషభిషలు లేకుండా తుది నిర్ణయం తీసుకునేలా చేసింది. 
 
ఒక రోజులో మూడు రాష్ట్రాలను  సుడిగాలిలా తిరిగేసి బహిరంగ సభల్లో, పార్టీ సమావేశాల్లో దిశానిర్దేశం చేసి తిరిగి రాగల అరుదైన గుణం వెంకయ్యనాయుడిది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే వెంకయ్యతో పోల్చవచ్చు. కానీ మోదీ సైతం ఏదేని బీజేపీ పాలిత రాష్ట్రంలో కీలక సమస్యను తక్షణం పరిష్కరించవలసి ఉందంటే పంపే తొలి వ్యక్తి వెంకయ్యే. ఒక బాధ్యతను కట్టబెడితే నూటికి నూరుపాళ్లు దాన్ని సక్సెస్‌ చేసి రాగల వ్యక్తిగా బీజేపీలో వెంకయ్యదే అగ్రస్థానం. వాజ్ పాయ్ నుంచి నరేంద్రమోదీ వరకు ఇద్దరు పార్టీ తరపున ప్రధానమంత్రుల తల్లో నాలుకలాగా వెంకయ్య  మెదిలారంటే మామూలు విషయం కాదు. నెల్లూరు జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్య ఢిల్లీ రాజకీయాల్లో తెలుగువారి ఏకైక దిక్కుగా చరిత్రను సొంత చేసుకోవడం నిజంగా తెలుగువారు గర్వించదగిన క్షణం.
 
ఇంతటి వెంకయ్యకు జీవితంలోనే అతిపెద్ద చిక్కువచ్చింది. రాజకీయాన్ని అనుక్షణం శ్వాసించిన ఈయనకు ఇక నోరు కట్టేసుకోవలసి ఉంటుంది. పెద్దల సభను నిర్వహించడం, అదుపు చేయడం వరకే ఆయన స్వరం పరిమితం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ గలగలా రాజకీయాలు మాట్లాడే వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకుండా ఉండటం పెద్ద పరీక్షని ముఖ్యమంత్రి  చంద్రబాబు  చెప్పారు. 
 
ఆయన జీవనం మొత్తం రాజకీయమేనని, దానితో ఇప్పటికిప్పుడు వెంటనే తెగతెంపులు చేసుకోవాలంటే కష్టమేనన్నారు. ఆ పరీక్షలో ఆయన పాసవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి ఫోన్‌చేసి హృదయ పూర్వక అభినందనలు తెలిపినట్లు చెప్పారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అని ప్రశ్నించగా... అభివృద్ధిలో నష్టం ఉంటుందనుకోనని, కానీ రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. 
 
రాజకీయ జీవితంలో అత్యున్నత శిఖరాలను రెకమెండేషన్లతో కాకుండా తన ప్రతిభతోనే, ఇంకా చెప్పాలంటే తన గొంతు బలంతోనే అందుకోగలిగిన వెంకయ్య నాయుడు తనకు ఎదురైన ఈ పరీక్షను కూడా ఎదుర్కోగలడని, తన రాజకీయ రహిత నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరని మనసారా కోరుకుందాం. వ్యక్తిగత ఇష్టాలను పక్కన బెట్టి వచ్చే అయిదేళ్లలో రాజ్యసభ నిర్వహణలో వెంకయ్య అసాధారణ ప్రతిభను కనబరుస్తారని విశ్వసిద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటను తూటాగా పేల్చిన తెలుగు బిడ్డకు రాజ్యాభిషేకం