కర్ణాటక ఫైట్ : సీఎం యడ్యూరప్ప ముందున్న మార్గాలు ఇవే...
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవితవ్యం శనివారం సాయంత్రం 4 గంటలకు తేలనుంది. బల నిరూపణ కోసం ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 111 సీట్లు కాగా, ఆయన వద్ద కేవలం 104 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మరో ఏడు
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవితవ్యం శనివారం సాయంత్రం 4 గంటలకు తేలనుంది. బల నిరూపణ కోసం ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 111 సీట్లు కాగా, ఆయన వద్ద కేవలం 104 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు కావాల్సి ఉంది.
వాస్తవానికి కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 222 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలకు ఎన్నికలను నిలిపేశారు. అయితే జేడీఎస్ నేత కుమారస్వామి రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. ఆయన చెన్నాపట్నం, రామనగరం నుంచి గెలుపొందారు. కానీ ఇప్పుడు విశ్వాస పరీక్షలో మాత్రం ఆయనకు ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. దీంతో ప్రస్తుతం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 221గా ఉంది.
తాజా ఎన్నికల్లో బీజేపీ మొత్తం 104 స్థానాలను గెలుచుకున్నది. బలపరీక్షలో నెగ్గేందుకు ఆ పార్టీకి ఏడు సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇద్దరు ఇండిపెండెంట్లు ఆ తర్వాత రేసులో ఉన్నారు. అయితే బలపరీక్ష గెలిచేందుకు యడ్డీ వద్ద మూడు మార్గాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ లోపు అన్ని పార్టీలు సమావేశం ఏర్పాటు చేసి, విప్ జారీ చేయనున్నాయి. మూడు రకాలుగా యడ్డీ తన ప్రభుత్వాన్ని నిలుపుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు ఏడుగురు ఎవరైనా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే అప్పుడు యడ్డీకి గెలిచే ఛాన్సు ఉంది.
విశ్వాస పరీక్షకు ముందు సుమారు 14 మంది కొత్త సభ్యులు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని పక్షంలోనూ యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. అలా జరిగితే అప్పుడు సభలోని సభ్యుల సంఖ్య 207కు తగ్గుతుంది. అంటే బీజేపీ 104 మంది సభ్యులు ఉన్న కారణంగా.. సగం మార్క్‌ను దాటినట్లు అవుతుంది. ఈ రకంగా యడ్డీ తన ప్రభుత్వాన్ని గట్టెక్కించే ఛాన్సుంది.
ఇక మూడో మార్గం.. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మొత్తానికే ఓటింగ్‌లో పాల్గొనకపోవడం. యడ్డీ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుమారు 14 మంది ఓటింగ్‌కు డుమ్మా కొడితే అప్పుడు యడ్డీ ప్రమాదం నుంచి ఈజీగా బయటపడే ఛాన్సుంది. ఇలా చేయడం వల్ల ఎమ్మెల్యేల ఓటింగ్ సంఖ్య 207కు చేరుకుంటుంది.
కానీ క్రాస్ ఓటింగ్ పాల్పడే లేదా ఓటింగ్‌కు డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రతిపక్షాలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినా, లేదా ఓటింగ్‌కు డుమ్మా కొట్టినా, వాళ్లపై అనర్హత వేటు పడుతుంది. అలా జరిగితే యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం.. ఆ ఏడుగురు సభ్యులు ఆరేళ్లు అనర్హతకు గురికానున్నారు.