Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిగ్రీతో పాటు బీఈడీ.. నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెట్టిన కేంద్రం

Advertiesment
డిగ్రీతో పాటు బీఈడీ.. నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెట్టిన కేంద్రం
, బుధవారం, 27 అక్టోబరు 2021 (22:56 IST)
నూతన విద్యావిధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(రికగ్నిషన్‌, నామ్స్‌ అండ్‌ ప్రొసీజర్‌) అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌-2021 పేరుతో నిబంధనలు జారీచేసింది.

యూజీసీ గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్శిటీలు ఈ కొత్త కోర్సులు నిర్వహించడానికి అనుమతించింది. ఈ కొత్త కోర్సు కింద విద్యార్థులకు ఒకవైపు సాధారణ చదువుతోపాటు, మరోవైపు ఉపాధ్యాయ శిక్షణ ఇస్తారు. తద్వారా బీఏ, బీకాం, బీఎస్సీతో సమానమైన అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీతోపాటు, టీచర్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ ఇస్తారు. ఈ కొత్త కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలు రెండు డిగ్రీలకు అనువైన అంశాలతోకూడి ఉంటాయని కేంద్రం పేర్కొంది.

దీని ద్వారా నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీచర్లను తయారుచేయనున్నట్లు తెలిపింది. ఈ కోర్సు 8 సెమిస్టర్లుగా నాలుగేళ్లు కొనసాగుతుంది. ఒకవేళ సెమిస్టర్లను సకాలంలో పాస్‌కాలేకపోయిన విద్యార్థులు మొత్తం కోర్సును గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంటర్‌మీడియట్‌, ప్లస్‌టూ పరీక్ష కనీసం 50% మార్కులతో పాసైన విద్యార్థులను మాత్రమే ఈ కోర్సుల్లో చేరడానికి అనుమతిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీలకు 5% మార్కుల రాయితీ ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా నేషనల్‌ కామన్‌ ఎంట్రెస్ట్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) నిర్వహిస్తారు. పరీక్ష ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారితంగా జరుగుతుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
 
కోర్సులో ప్రవేశించే సమయంలోనే అభ్యర్థి తనకు ఏ కోర్సు కావాలో (బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ) ఎంచుకోవాలి. ఒకవేళ కోర్సులో చేరిన తర్వాత మార్చుకోవాలనుకుంటే నెలరోజుల్లోపు ఆ పనిచేయొచ్చు. ఇందుకు అవసరమైన పాఠ్యాంశాలను ఎన్‌సీటీఈ అభివృద్ధిచేస్తుంది. అందులో 30శాతం మేర మార్చుకొనే సరళతను సంబంధిత యూనివర్శిటీలకు ఇస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్