దీపావళి పండుగను పురస్కరించుకుని అయోధ్య నగరంలో 9వ దీపోత్సవాన్ని నిర్వహించారు. సమయూ నది తీరంలో 26.17 లక్షల దీపాలను భక్తులు వెలిగించారు. ఈ దీపోత్సవంలో భాగంగా ఒకేసారి 2128 మంది భక్తులు హారతలు ఇచ్చారు. రామ్ కీ పైడీ ఘాట్ వద్ద స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. అదే విధంగా, ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది. ఈ రెండు రికార్డులను గిన్నిస్ సంస్థ అధికారికంగా ధృవీకరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
దీపోత్సవం సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రామ్ లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతిని నిర్వహించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలుదిశలా దీపకాంతులతో ప్రకాశించింది. ఈ వేడుకల నేపథ్యంలో అయోధ్యలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రామమందిర ప్రారంభం తర్వాత అయోధ్యకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిన విషయం తెల్సిందే. జనవరి నుండి జూన్ మధ్యకాలంలోనే 23.82 కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వారిలో సుమారు 50 వేల మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
కాగా, 2017లో మొదటిసారిగా దీపోత్సవం నిర్వహించినప్పుడు 1.78 కోట్ల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ ఏదాది ఆ సంఖ్య పది రెట్లు పెరిగి అయోధ్య పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.