ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో భవ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ముహూర్తాన్ని ఖరారు చేశఆరు. వచ్చే యేడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. ఈ ప్రాణప్రతిష్ట వేడుకలను నాలుగు దశలుగా విభజించారు.
తొలి దశలో పలు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమ నిర్వహణకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నారు. మూడో దశలో జనవరి 22న దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26 నుంచి భక్తులకు రామయ్య దర్శనం కల్పించనున్నారు.
ఇదిలావుంటే, 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 21 (మంగళవారం) తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభంకానున్న ప్రదక్షిణ.. రాత్రి 11.38 గంటలకు ముగియనుంది. ఇందులోభాగంగా రామభక్తులు 42 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు. ఇదిలావుంటే, రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. వీరిలో 200 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీరిలో 20 మందిని అర్చకులుగా ఎంపిక చేయనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.