ట్రంప్ చేస్తున్నది జాతి వివక్షే.. మరి మనమాటేమిటి? అదేం మనం చేస్తే రైటైపోతుందా?
దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి తమవంతు దోహదం చేసిన విదేశీయులను ఇప్పుడు పనులు కొట్టేస్తున్న పరాయివారిగా ముద్రవేసి తరమడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఎవ్వరైనా గర్హించాల్సిందే. కానీ మన దేశంలోనే మా పనులను, మా కూలీలను మీరు కొట్టేస్తున
అమెరికా అమరికన్లకే అంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనలు, తీసుకొస్తున్న చర్యలను ప్రపంచమంతా అసహ్యంచుకుంటోంది. కాదనలేం. దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి తమవంతు దోహదం చేసిన విదేశీయులను ఇప్పుడు పనులు కొట్టేస్తున్న పరాయివారిగా ముద్రవేసి తరమడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఎవ్వరైనా గర్హించాల్సిందే. కానీ మన దేశంలోనే మా పనులను, మా కూలీలను మీరు కొట్టేస్తున్నారంటూ ఒక రాష్ట్రం వారిని మరో రాష్ట్రం వారు తరమగొడుతుంటే, దాడులు చేస్తుంటే మనం ఎవరికి చెప్పాలి. జాతి వివక్ష, ప్రాంత వివక్ష అమెరికా అధ్యక్షుల వారిలోనే కాదు మనవారిలో కూడా ఉందని తెలిస్తే షాక్ తగులుతుంది.
విషయంలోకి వస్తే...బతుకుదెరువు కోసం వలస వెళ్లిన రాష్ట్రవాసులను మహారాష్ట్రలోని స్థానికులు చితకబాదారు. ‘మా పనులకు అడ్డొస్తారా.. తక్షణం మా ప్రాంతం నుంచి వెళ్లిపోండి..లేదంటే చంపేస్తాం’ అంటూ బెదిరించారు. ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలానికి చెందిన వందలాది మంది పనుల కోసం మహారాష్ట్రలోని పాల్గరు జిల్లాకు వలస వెళ్లారు. వీరితోపాటు శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలూ అక్కడే పనులు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల వారివల్ల తమ ఉపాధికి గండి పడిందని స్థానికులు కొంతకాలంగా గొడవ చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అక్కడి కూలీలు కర్రలు, రాడ్లతో పని దగ్గరే దాడికి దిగి, కాసేపయ్యాక వెనుదిరిగారు. సాయంత్రం 6.30 గంటలకు ఏపీ కూలీలు నివాసముంటున్న విరార్ వెస్ట్ (థానే జిల్లా పరిధి) వద్దకు చేరుకుని మరోమారు దాడి చేశారు. ఈ దాడిలో పది మందికి పైగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దిక్కుచోచని బాధితులు మీడియాకు ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ అధికారులు తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
ప్రపంచమంతా నిరుద్యోగం ప్రబలుతున్నప్పుడు, స్థానికులకు ఉపాధి లభ్యం కాకుండా పోతున్నప్పుడు తప్పు ప్రజలదా, పాలకులదా అనే విచక్షణ లేకుండా దాడులకు దిగుతున్న ఇలాంటి దురహంకార ధోరణిని ట్రంప్ ప్రదర్శించినా భారత దేశంలో స్థానికులే ప్రదర్శించినా సమానంగా ఖండించాల్సిందే. కాదంటారా?