దేశవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత మూడు నాలుగు రోజులుగా వాతావారణంలో సంభవించిన మార్పుల కారణంగా మరో రెండు రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని, అలాగే వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు, హిమపాతానికి అవకాశం ఉందని, అందువల్ల ప్రజలతో పాటు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ నెల 29, 31వ తేదీల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లఢక్, గిల్గిత్, బాలిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల రోజంతా చల్లగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది.