Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో మళ్లీ కరోనా అలజడి... మార్కెట్లు మూసివేసే దిశగా అడుగులు...

Advertiesment
ఢిల్లీలో మళ్లీ కరోనా అలజడి... మార్కెట్లు మూసివేసే దిశగా అడుగులు...
, మంగళవారం, 17 నవంబరు 2020 (16:43 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా అలజడి చెలరేగింది. ఆ వెంటనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. దీంతో మార్కెట్లను మూసి వేసే దిశగా ఢిల్లీ సర్కారు అడుగులు వేస్తోంది. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించబోమని సోమవారమే కేజ్రీవాల్ ప్రకటించారు. ఒక రోజు వ్యవధిలో ఆయన ఈ కీలక నిర్ణయం గురించి మాట్లాడారు.
 
ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, మార్కెట్లలో జనాలు ఎక్కువగా పోగవుతున్నారని... ఇవి కరోనా హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే మార్కెట్లను కొన్ని రోజుల పాటు మూసేయాలనే నిర్ణయానికి వచ్చామని, కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనను పంపామన్నారు. 
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రస్తుతం పెళ్లిళ్లకు 200 మంది వరకు అనుమతిస్తున్నామని... కానీ, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మళ్లీ పాత నిబంధన (50 మందికే అనుమతి)కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీనికి సంబంధించిన ప్రపోజల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపామని... ఆయన నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
దీపావళి సమయంలో చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజికదూరం పాటించకుండా ఉండటాన్ని తాము గమనించామని కేజ్రీవాల్ అన్నారు. తమకు ఏమీ కాదనే ధోరణిలో జనాలు ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. 
 
కరోనా ఎవరికైనా వస్తుందని, పరిస్థితిని దారుణంగా మారుస్తుందని చెప్పారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. మీ కోసం, మీ కుటుంబాల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
 
ఇదిలావుంటే, ఢిల్లీలో కరోనా మూడో వేవ్ కొనసాగుతూ, కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)కు చెందిన 75 మంది వైద్యులు, 250 మంది పారా మెడికల్ సిబ్బంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం నియమించడం జరిగింది. 
 
కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరంతా సాధ్యమైనంత త్వరగా హస్తినకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఏపీఎఫ్ యూనిట్ల నుంచి వీరిని ఢిల్లీకి పంపుతున్నామని, అసోం నుంచి తమిళనాడు వరకూ పలు ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది తక్షణం న్యూఢిల్లీకి రానున్నారని, వీరిలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వైద్య సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించారు. 
 
వాణిజ్య విమానాల్లో వారు వస్తున్నారని, వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లనూ ఇప్పటికే పూర్తి చేశామని ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల మధ్య కరోనాపై సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. 
 
అంతకుముందు హోమ్ శాఖ కార్యదర్శి అజ్ కుమార్ బిర్లా, ఐసీఎంఆర్, డీఆర్డీఓ అధికారులు సమావేశమై, ఢిల్లీ సర్కారుకు కరోనాను ఎదుర్కోవడంలో పూర్తి సహాయాన్ని అందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే సీఏపీఎఫ్ వైద్యులు, సిబ్బందిని దేశ రాజధానికి పంపాలన్న నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రెడిట్ కార్డులను మీరెలా ఉపయోగిస్తున్నారు..?