Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడి కాల్చివేత!!

BSP Armstrong Murder

వరుణ్

, ఆదివారం, 14 జులై 2024 (13:06 IST)
బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడు కె.తిరువేంగడాన్ని చెన్నై నగర పోలీసులు కాల్చి చంపేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు తిరువేంగడం. పోలీసు కస్టడీ నుంచి తిరువేంగడం పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
 
ఓ ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు విచారణలో భాగంగా తిరువేంగడాన్ని నార్త్ చెన్నైలోని ఓ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు కూరగాయాల మార్కెట్లోని ఓ షెడ్‌లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
 
నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా వేషం మార్చి గత పది రోజులుగా పెరంబూర్ ప్రాంతంలో తిరుగుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ కదలికలను గమనించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హిస్టరీ షీట్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితమే నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా, జులై 5న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఓ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ హత్య తమిళనాట పెను దుమారానికి దారితీసింది. రాజకీయ పార్టీల అధ్యక్షులకే రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చెన్నై నగర పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటుపడింది. ప్రస్తుతం చెన్నై పోలీస్ కమిషనర్‌గా అరుణ్ నియమితులయ్యారు. ఈయన రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని గుర్తించిన ఎఫ్.బి.ఐ