తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్-బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముతూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి చొరబడ్డ దుండగులు.. పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం బ్రాంచ్‌ను తెరిచారు సిబ్బంది. కాసేపటికే కస్టమర్ల రూపంలో లోపలికి ప్రవేశించారు దుండగులు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా.. వారిని గన్‌తో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకు పైగా బంగారాన్ని, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు.
ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువే రూ. 7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.