న్యూఢిల్లీ: మోడీ రెండేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పు ఇది అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. 5 రాష్ట్రాల్లో ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో బిజెపికి సొంతంగా మెజార్టీ స్థానాలొచ్చాయని, బెంగాల్‌లో నాడు 4.6శాతం ఉన్న ఓట్ల శాతం ఇప్పుడు 11శాతానికి పెరిగిందన్నారు. కేరళలో 6శాతం ఉన్న ఓట్లు 15శాతం పెరిగాయని, ఒక స్థానాన్ని గెలుచుకున్నామని వివరించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో తమ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకున్నామని, ఈ అయిదురాష్ట్రాల్లో బిజెపికి గతంలో పెద్దగా బలం లేదని చెప్పుకొచ్చారు.
తాను బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాడే, నా మిషన్ 7 స్టేట్స్ అని చెప్పానని అమిత్ పేర్కొన్నారు.. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బిజెపి బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. ఈఎన్నికలతో అయిదు రాష్ట్రాల్లో బిజెపికి బలమైన పునాది పడిందని, ఈ పునాదిపై వచ్చే 2019 నాటికి బిజెపి బలమైన పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు పార్టీలు భయపడుతున్నాయని, కాంగ్రెసేతర పక్షాల గెలుపు మాకెప్పుడు ఆనందమేనని అమిత్ సమర్దించుకున్నారు. మోడీ అభివృద్ధి ఎజెండాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పనికిమాలిన అంశాలను తెరపైకి తెచ్చిందని, ప్రజలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు.