అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలకు నో బ్రేక్: ఇక విలీన చర్చల్లేవని ప్రకటించిన పన్నీర్ సెల్వం
అధికార అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు నాయకులు సిద్ధపడటంతో ఇప్పటికే పన్నీర్‌సెల్వం, పళనిసామి, శశికళ పార్టీ పదవి కట్టబెట్టిన టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో మూడు వర
అధికార అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు నాయకులు సిద్ధపడటంతో ఇప్పటికే పన్నీర్‌సెల్వం, పళనిసామి, శశికళ పార్టీ పదవి కట్టబెట్టిన టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు తమ ప్రాబల్యం చాటుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీకి క్యూ కడుతున్నారు. దీంతో 45 సంవత్సరాల అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి.
జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో వర్గాలు మొదలయ్యాయి. జయలలిత ఉన్నంత కాలం పార్టీకి దూరంగా ఉన్న చిన్నమ్మ శశికళ ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ముఖ్యమంత్రి కావడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. పరిస్థితులు అనకూలించక సీఎం కుర్చీలో కూర్చోలేకపోయారు. ఇదే సమయంలో తనతో బలవంతంగా రాజీనామా చేయించారన్న ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆమెపై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో పార్టీలో వర్గ రాజకీయాలకు మరోసారి తెరలేచింది. శశికళ జైలుకు వెళ్లడం, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ నియామకం... చకచకా జరిగిపోయాయి.
ఆర్కేనగర్ ఎన్నిక రద్దయింది. రెండాకుల గుర్తు కోసం లంచమివ్వజూపారనే కేసులో ఆయన ఏకంగా తీహార్‌జైలుకు వెళ్లారు దినకరన్. దీంతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఒక్కటవ్వడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ.. ఎవరూ రాజీ ధోరణి ప్రదర్శించకపోవడంతో అవి మధ్యలోనే ఆగాయి. దినకరన్ కూడా బెయిలుపై బయటికి వచ్చారు.
ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం రాష్ట్ర పర్యటన చేయగా... పళనిస్వామి ప్రభుత్వ పథకాల అమలు, తదితర కార్యక్రమాలతో పార్టీలో బలం పెంచుకోవడానికి యత్నిస్తున్నారు. ఇదే సమయంలో టీటీవీ దినకరన్ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీంతో అన్నాడీఎంకేలో మూడుముక్కలాట మొదలైంది.
మరోవైపు జయలలిత రాజకీయ వారసురాలు తానేనని పేర్కొంటూ వస్తున్న ఆమె మేనకోడలు దీప కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు విలీన చర్చలు ఉండవని, అందుకోసం ఏర్పడిన కమిటీని రద్దుచేస్తున్నట్లు పన్నీర్‌సెల్వం తాజాగా ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికకు ఇప్పట్లో తెరపడేట్లు లేదని రాజకీయ పండితులు అంటున్నారు.