Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమత చెంతకు భార్య... విడాకులిచ్చేందుకు సిద్ధమైన బీజేపీ ఎంపీ!

Advertiesment
మమత చెంతకు భార్య... విడాకులిచ్చేందుకు సిద్ధమైన బీజేపీ ఎంపీ!
, సోమవారం, 21 డిశెంబరు 2020 (16:23 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం కమలనాథులు బెంగాల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు కూడా తెరలేపారు. దీంతో పలువురు టీఎంసీ ప్రజా ప్రతినిధులు, నేతలు కాషాయం కండువా కప్పుకుంటున్నారు. 
 
అయితే, బీజేపీ నేతలకు షాకిస్తూ ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ భార్య ఏకంగా మమతా బెనర్జీ పార్టీ తీర్థం పుచ్చుకుంది. దీంతో షాక్ తిన్న ఎంపీ.. భార్యకు విడాకుల నోటీసు పంపించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన పేరు సౌమిత్ర ఖాన్. భార్య సుజాత్ మోండల్ ఖాన్. ఈమె బీజేపీని వదిలి టీఎంసీలో చేరడంతో ఆమెకు విడాకుల నోటీసు పంపేందుకు సౌమిత్ర ఖాన్ సిద్ధమయ్యారు. 
 
బిష్ణుపూర్ ఎంపీ అయిన సౌమిత్ర ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆమె బీజేపీని వదిలి టీఎంసీలో చేరి చాలా పెద్ద తప్పు చేసిందని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్పారు. తన ఇంటి పేరైన ‘ఖాన్’ను కూడా పేరు చివర తొలగించుకోవాలని బెంగాల్ బీజేపీ యువమోర్చాకు కూడా అధ్యక్షుడైన సౌమిత్ర ఖాన్ తన భార్యకు సూచించారు. 
 
అధికార టీఎంసీ తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని సౌమిత్ర తన భార్యకు గుర్తుచేసే విధంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తన వేతనంలో 50 శాతం ప్రతి నెలా భార్య ఖాతాకు పంపిస్తానని ఆమెకు మాటిచ్చానని, ఇకపై ఆ భాగం గురించి అడగవద్దని సౌమిత్ర ఖాన్ తన భార్యకు స్పష్టం చేయడం కొసమెరుపు.
 
బీజేపీ తనకు అన్ని విధాలుగా గుర్తింపునిచ్చిందని, తనకు మద్దతుగా తన భార్య కూడా ప్రచారం చేసిన మాట వాస్తవమేనని.. అయితే.. బీజేపీ అనే పేరు లేకుండా తాను గెలిచేవాడిని కాదన్నారు. కుటుంబాన్ని కూడా కాదనుకుని తన భారీ లక్ష్యాల కోసం టీఎంసీలో చేరిందని, టీఎంసీ పన్నాగంలో పడి చాలా పెద్ద తప్పు చేసిందని ఆయన ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ స్వగత రాయ్ సమక్షంలో సుజాత టీఎంసీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారంలో పాల్గొంటేనే పాస్ మార్కులేస్తా : లెక్చరర్ వికృత చేష్టలు