Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

అఖిలేష్ ఇమేజ్ గెలిపిస్తుందా.. మరి మోదీ ఇమేజ్ పోయినట్లేనా?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతాన్ని పోలింగ్ పూర్తి కాకముందే అంచనా వేసే పనిలో మీడియా మునిగిపోయింది. మొత్తం 403 సీట్లలో సగానికి పైగా (209) ఆదివారం పోలింగ్‌ పూర్తవడంతో ఫలితాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Advertiesment
Elections-2017
హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (04:41 IST)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతాన్ని పోలింగ్ పూర్తి కాకముందే అంచనా వేసే పనిలో మీడియా మునిగిపోయింది. మొత్తం 403 సీట్లలో సగానికి పైగా (209) ఆదివారం పోలింగ్‌ పూర్తవడంతో ఫలితాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పోలింగ్‌ ‘సరళి’ ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొదటి రెండు దశల పోలింగ్‌ జరిగిన పశ్చిమ యూపీలో ఓటర్ల మనోగతం ఎస్పీ–కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల పండితులు జోస్యం చెబుతున్నారు.
 
ముస్లింలతో పాటు యాదవులు.. ముఖ్యంగా ములాయంసింగ్‌ యాదవ్‌ బంధువర్గ ప్రభావం ఎక్కువున్న నైరుతి యూపీ, రోహిలాఖండ్‌లో ఆదివారం జరిగిన మూడో దశ పోలింగ్‌లోనూ అఖిలేశ్‌ ఇమేజ్‌ ఫలితంగా ఆయన పార్టీకి గాలి అనుకూలంగా ఉందని పరిశీలకుల అంచనా. ఎస్పీ ఇంటి పోరు ముగిసిన వెంటనే కాంగ్రెస్‌తో తొలిసారి కుదిరిన ఎన్నికల పొత్తు తర్వాత నుంచి ఈ కూటమికి అనుకూలంగా ప్రచారం ప్రారంభమైంది. ప్రియాంక ప్రచారం, అఖిలేశ్, రాహుల్‌గాంధీ జోడీ ప్రచారంపైనా సానుకూల అంచనాలు వెలువడ్డాయి.
 
క్లీన్  ఇమేజ్, కాంగ్రెస్‌తో కలసి ప్రచారంతో అఖిలేశ్‌ ‘జనాకర్షణ శక్తి’ ఉన్న నేతగా ఆవిర్భవించినట్టు అంచనాలు వేస్తున్నారు. మోదీతో సమానంగా ప్రజాదరణ సాధించారంటున్నారు. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు పొత్తు కింద అఖిలేశ్‌ 105 సీట్లు కేటాయించడం పొరపాటని చెబుతున్నారు. హస్తానికి అదనంగా 40–50 సీట్లు ఇచ్చి తప్పుచేశారని విశ్లేషిస్తున్నారు.
 
బీజేపీ గాలి 2014నాటి ఎన్నికల్లోలా లేకపోయినా యూపీలోని అన్ని ప్రాంతాల్లో, హిందువుల్లోని అన్ని వర్గాల్లో ఆ పార్టీ పునాదులు బలంగానే ఉన్నాయని పరిశీలకుల అంచనా. పార్టీ ఎన్నికల ప్రచార బలమంతా మోదీనే అన్నట్లు సాగుతోంది. ఒక్క ముస్లింలను మినహాయిస్తే కులాలకు అతీతంగా మోదీ తన ప్రచారంతో అందరి దృష్టీ ఆకట్టుకుంటున్నారు.
 
మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీని అందరూ మూడోస్థానానికి నెట్టివేశారు. కొన్ని కులాలు, ముస్లింల ఓట్ల కలయిక ఆధారంగా ఈ పార్టీ రూపొందించిన పాత ఫార్ములా ఈసారి పనిచేయదని నిపుణుల అంచనా. 2007 ఎన్నికల్లో 203 సీట్లతో మెజారిటీ సాధించిన బీఎస్పీని రాజకీయ విశ్లేషకులందరూ విజయావకాశాల్లేని పార్టీ కింద జమకడుతున్నారు. మొదటి దశ పోలింగ్‌లో ఏ పార్టీకి అధిక ఓట్లు పడ్డాయని ప్రచారం జరుగుతుందో ఆ పక్షమే చివరికి మెజారిటీ సాధిస్తుంనే అంచనాను యూపీ ఎన్నికలకు సంబంధించిన మూఢ నమ్మకంగా భావించక తప్పదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుకుంటే అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌