ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. మేజర్ అయిన అమ్మాయి తనకు నచ్చిన వాడితో ఎక్కడైనా ఉండొచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. 20 ఏళ్ల యువతి తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన ఓ కేసులో.. జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రజ్నీశ్ భట్నాగర్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 12న సులేఖ అనే యువతి తన ప్రియుడు బబ్లూతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే తన చెల్లెలు కిడ్నాప్‌కి గురైందంటూ ఆమె అన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. బబ్లూ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని కూడా సదరు పిటిషన్‌లో పేర్కొన్నాడు.
దీంతో ఢిల్లీ పోలీసుల ద్వారా సులేఖ జాడ కనిపెట్టిన ధర్మాసనం.. ఆ యువతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అయితే తన ఇష్ట ప్రకారమే బబ్లూను వివాహం చేసుకునేందుకు వెళ్లానంటూ సులేఖ కోర్టుకు వివరించింది. దీంతో సులేఖకు ఇష్టమైతే తాను కోరుకున్నవాడితోనే ఉండవచ్చునంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె కుటుంబ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదనీ... సులేఖ సోదరుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది.