తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సినీ నటి ఖుష్బూ సుందర్ పోటీచేస్తున్నారు. ఆమెకు భారతీయ జనతా పార్టీ టిక్కెట్ కేటాయించింది. చెన్నై నగరంలోని థౌజండ్ లైట్ స్థానం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ చేరారు.
కాగా, ఏప్రిల 6వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఖుష్బూకు సీటును కేటాయించింది. డీఎంకే నేత డాక్టర్ ఎళిలాన్‌తో ఆమెప పోటీపడనున్నారు.
తనకు టికెట్ దక్కడంపై కుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోమనని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. అక్కడ కష్టపడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు కుష్బూ డీఎంకేలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడిన కుష్బూ.. సోనియాకు ఘాటు లేఖ రాశారు. పార్టీలో అణచివేత ధోరణి ఎక్కువ అయిపోయిందని దుమ్మెత్తి పోశారు.
పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న కొందరు నాయకులు, క్షేత్రస్థాయితో సంబంధం లేని, ప్రజల గుర్తింపు లేని వారు పార్టీ కోసం నిజాయతీగా పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని, పక్కన పెడుతున్నారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఇతర పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేతో కలిసే బీజేపీ పోటీ చేసింది. కానీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి 20 స్థానాల్లో బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.