జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 11 యేళ్ల మైనర్ బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖుంతి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితులు 10 నుంచి 15 యేళ్ల లోపువారు కావడం గమనార్హం.
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం సందర్భంగా తనకు ఇంతకుముందే తెలిసిన నిందితులతో వాగ్వివాదం జరిగింది.
ఈ పెళ్లి తర్వాత మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్థరాత్రి వేళ స్వగ్రామానికి బయలుదేరింది. ఆ యువతిని అనుసరించిన మైనర్లు కొంతదూరం వచ్చాక అడ్డగించి, ఆ తర్వాత ఎవరూలేని ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్నేహితురాళ్లు జరిగిన విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న బాధిత యువతి తల్లిదండ్రులను చూడగానే వారు పారిపోయారు.
అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు తొలుత బాధిత యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని వెనుకంజ వేశారు. అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతి తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.