ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు, పిల్లలతో సహా 116 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అలీఘర్ రేంజ్ ఐజి శలభ్ మాథుర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ: "ఇప్పటి వరకు, 116 మరణాలు నిర్ధారించబడ్డాయి.
ఇరవై ఏడు మృతదేహాలు ఎటాలోని మార్చురీలో ఉన్నాయి. మిగిలినవి హత్రాస్‌లో ఉన్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం వివిధ ఆసుపత్రులకు పంపుతున్నారు. "గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగింది." అంటూ చెప్పుకొచ్చారు.
భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో సత్సంగం ఏర్పాటు చేయగా, సత్సంగం ముగుస్తుందనగా ఒకేసారి అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, సభా స్థలి చిన్నది కావడంతో పలువురికి ఊపిరి ఆడలేదని, కొందరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్నారు.