మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 103 యేళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన మూడో పెళ్లి చేసుకున్న మహిళ వయసు 49 యేళ్లు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆసక్తకిర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్‍కు ఇది మూడో వివాహమని, రెండవ భార్య చనిపోయిన తర్వాత ఆయన మూడో పెళ్లి చేసుకున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రెండో భార్య మరణం తర్వాత ఒంటరిగా మారిపోయాడని తెలిపాయి. తాజాగా తనకంటే 54 ఏళ్లు తక్కువ వయసున్న ఫిరోజ్ జహాన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి.
అయితే వీరిద్దరి వివాహం గతేడాదే జరిగినప్పటికీ ఆ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారిందని, అందుకే విషయం వెలుగులోకి వచ్చిందని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివాహం అనంతరం ఆటో రిక్షాలో నూతన దంపతులు ఇంటికి తిరిగివస్తున్నట్టుగా వీడియోలో ఉంది. వీరిని చూసి కొందరు నవ్వుతుండడం వీడియోలో కనిపించింది.
ఇకపోతే, 103 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంపై హబీబ్ నాజర్ ఆసక్తికరంగా స్పందించారు. వయస్సు 103 ఏళ్లు. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. నాసిక్ లో నా మొదటి భార్య చనిపోయినప్పుడు జీవితంలో మొదటిసారి ఒంటరిగా మారాను. రెండో పెళ్లి చేసుకోవడానికి లక్నో వెళ్లాను. అయితే నా రెండో భార్య కూడా ఈ లోకం వదిలి వెళ్లిపోయింది.
మళ్లీ ఒంటిరిగా మారిపోయాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒంటరిగా ఉన్న జహాన్ కూడా నాతో కలిసి ప్రయాణాన్ని సాగించడానికి సిద్ధంగా ఉంది' అని హబీబ్ నాజర్ తెలిపారు. తన భర్త పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని జహాన్ పేర్కొంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, హబీబ్ ను పెళ్లి చేసుకోవాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని ఆమె చెప్పింది.