ప్రియదర్శిని మట్టూ హత్య కేసులో నిందితుడుకి సుప్రీం కోర్టు కాస్త ఊరట కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంతోష్ సింగ్‌కు 2006లో ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయగా.. సంతోష్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్మానించింది.
న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రయదర్శిని మట్టూ జనవరి 1996లో న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న తన నివాసంలో ప్రియదర్శిని సహ విద్యార్థి అయిన సంతోష్ సింగ్ అత్యాచారం జరిపి హత్య చేశాడు. సంతోష్ సింగ్ మాజీ ఐపిఎస్ కుమారుడు. కాగా.. ఈ కేసులో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 2006లో నిందింతుడిపై అత్యాచారం హత్య కేసులు నమోదు చేసి ఉరిశిక్షను విధించింది.
ఈ తీర్పు అనతంరం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సింగ్‌కు సుప్రీం కోర్టు కాస్త ఊరట కలిగిస్తూ.. మరణశిక్షను రద్దు చేసి.. జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రియదర్శిని మట్టూ తండ్రి సి ఎల్ మట్టూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టుల నుంచి నిందితులకు సరైన శిక్ష పడుతుందని ఆశించామని, కనీసం ఈ జీవిత ఖైదునైనా తగ్గించకుండా ఉంటే చాలునని ఆయన అన్నారు.