యూపీఏ పాలనలో అమెరికా పెత్తనం చెలాయించడాన్ని సహించబోమని జేడీ యూ అధ్యక్షులు శరద్ యాదవ్ అన్నారు. అమెరికాతో మిత్రుత్వం కొనసాగాలి కానీ, దేశ పరిపాలనలో అమెరికా పెత్తనాన్ని మాత్రం సహించేదిలేదని శరద్ యాదవ్ చెప్పారు. అలాగే భారత్‌ను అమెరికా నియంత్రించడం సరికాదని శరద్ యాదవ్ పేర్కొన్నారు.
కాగా నోటుకు ఓటుపై వికీలీక్స్ కథనంపై లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు పంచిన యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అవినీతితో అధికారానికి వచ్చిన యూపీఏ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అవినీతితో గద్దెనెక్కిన యూపీఏ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
అయితే వికీలీక్స్ కథనాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తిప్పికొట్టారు. వికీలీక్స్ నిర్ధారణలపై నిరూపిత ఆధారాలు లేవని రాజ్యసభలో ప్రణబ్ ముఖర్జీ కొట్టిపారేశారు. అవినీతికి పాల్పడి ఉంటే కోర్టులో కేసు వేయండని ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. కాగా వికీలీక్స్ కథనాలపై సభల్లో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ, పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడాయి.