Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ప్రధాని

నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ప్రధాని
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై పాక్‌వైపు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్‌లోకి చొరబడుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

ఇటువంటి ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించరాదని హెచ్చరించారు. నియంత్రణ రేఖతోపాటు, నేపాల్, బంగ్లాదేశ్, సముద్ర సరిహద్దులు, తదితర మార్గాల గుండా దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న రెండు రోజుల డీజీపీ, ఐజేపీల సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ పైవిషయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు శాంతియుతంగా జరగడం సంతృప్తి కలిగిస్తోందని ప్రధాని అన్నారు. అంతేకాకుండా 1980 సమయంతో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడు హింసాకాండ గణనీయంగా తగ్గిందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో చొరబాట్లు పెరుగుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ముఖ్యంగా ఇటీవలి కాలంలో సాయుధ మిలిటెంట్లతో తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu