Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుషికేశ్‌లో బంగీజంప్... చేసే సాహసం మీకుందా..?!!

Advertiesment
రుషికేశ్‌లో బంగీజంప్... చేసే సాహసం మీకుందా..?!!
, మంగళవారం, 6 మార్చి 2012 (19:21 IST)
PTI
పర్యాటక ప్రాంతాలంటే ఎంతసేపూ ఏ ఊటీయో, కొడైకెనాలేనా? కాస్త డిఫరెంట్‌ పర్యాటకం ఏమయినా ఉంటే బావుండూ అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు రుషికేశ్ చక్కగా సరిపోతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రుషికేశ్ నగరం ఒకటి. ఎన్నో పుణ్యక్షేత్రాలతో తీర్థయాత్రా స్థలిగా ఉన్న ఈ నగరం ఇప్పుడు సాహస క్రీడల కేంద్రంగా కూడా మారుతోంది. 90లతో పోలిస్తే ఇటీవలి కాలంలో దేశంలో సాహస క్రీడలు, పర్వతారోహణ, బంగీ జంపింగ్, నదిలో సాహస యాత్రలంటూ సామాన్లు సర్దేవారి సంఖ్య పెరిగిపోయింది. వీటినే సాహస పర్యాటకం అని పిలుస్తున్నారు.

సాదాసీదాగా వెళ్లి వచ్చే పర్యాటకంతో పోలిస్తే ఈ సాహస పర్యాటకం ఇచ్చే థ్రిల్ ఇంతా అంతా కాదని యాత్రకు వెళ్లి వచ్చిన వారంటున్నారు. సాహస విన్యాసాలు చేయాలనుకునేవారు రుషికేశ్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహన్‌చట్టీ గ్రామాన్ని చూడాల్సిందే. బంగీజంప్‌ చేసి మీ సాహసత్వాన్ని నిరూపించుకోవచ్చు. ఒక్క బంగీ జంపింగే కాదు, పలు సాహస క్రీడలకు ఈ గ్రామం నెలవు. సాహస యాత్రలంటే మక్కువ చూపే ఒక మాజీ ఆర్మీ జనరల్ ఆలోచనల్లోంచి పుట్టినదే జంపింగ్ హైట్స్ అనే కార్యక్రమం. దీన్ని కొందరు మాజీ సైనికాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తుంటారు. 2010 సంవత్సరం నుండి బంగీ జంపింగ్ చేయడం ప్రారంభించారు. ఇందుకు తగు శిక్షణ కూడా ఇక్కడ ఇస్తారు. అక్కడ నిట్టనిలువుగా ఉండే కొండ అంచు నుండి 83 మీటర్ల ఎత్తు నుండి దూకేయడమనేది చూసేవారికి గగుర్పాటు కలిగించినా, జంపర్లకు మాత్రం చక్కని అనుభూతినిస్తుంది.

అయితే, దూకడానికి ఒక లెక్కుంది. అంతేకానీ, ఎలాపడితే అలా దూకేస్తే ఎముకలు కూడా మిగలవు. అందుకే అల్లంత ఎత్తునుండి దూకడానికి సిద్ధమయ్యే ఔత్సాహికులకు, పలు రకాల తర్ఫీదునిస్తారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఇచ్చే శిక్షణ ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని మాజీ ఆర్మీ జనరల్, జంపింగ్ హైట్స్ సంస్థ సంచాలకులు రాహుల్ నిగమ్ చెప్పారు. ఔత్సాహికుల మానసిక, శారీరక పరిస్థితులు అనువుగా ఉన్నాయని ధ్రువీకరించుకున్న తర్వాతే వారి చీలమండలకు రబ్బరు తాళ్లు కట్టించుకునే అనుమతిస్తామని తెలిపారు.

బంగీ జంప్ చేయాలనుకునే వారి వయసు కనీసం 12 ఏళ్లుంటే సరిపోతుంది. కనీస బరువు 35 కిలోలుండాల్సిందే. గుండెపోటు, రక్తపోటు బాధితులు బంగీజంప్ చేయరాదు. గర్భిణులకు బంగీజంప్ అనుమతి లేదు. కొంత కాలం క్రితం వరకు బంగీ జంప్ శిక్షణ అంటే విదేశీ కోచ్‌లే అనుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడిప్పుడే ఇందులో మార్పు వస్తోంది. పలువురు భారతీయ యువకులు బంగీ జంప్ శిక్షకులుగా తయారవుతున్నారు. వీరికి న్యూజిలాండ్ శిక్షకులు తర్ఫీదునిస్తున్నారు.

నిజానికి, భారతీయులు ఇప్పటికీ బంగీ జంప్‌ను ప్రమాదకరమయిన విన్యాసంగానే చూస్తున్నారు తప్పించి ఒక సాహస క్రీడగా చూడటం లేదని అమెరికన్ సీనియర్ బంగీ జంపర్ టోబీ అంటున్నారు. బంగీజంప్ అనేది సురక్షితమయిన సాహస విన్యాసమయినప్పటికీ మిగిలిన దేశస్తులతో పోలిస్తే భారతీయులు దీన్ని చేయడానికి మొహమాటపడతారని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది.

పలువురు భారతీయ కుర్రాళ్లు ఇప్పుడు అల్లంత ఎత్తునుండి దూకేస్తాం.. మా చీలమండలకు రబ్బరు తాళ్లు కట్టండి అంటూ వస్తున్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని టోబీ తెలిపారు. దేశంలో ఉన్న విభిన్న భౌగోళిక ప్రాంతాలు లెక్కలేనన్ని సాహస క్రీడలకు అవకాశం కల్పిస్తుండగా, వాటిని ఇప్పుడిప్పుడే వాటి విలువను గుర్తించడం మొదలయింది.

ప్రస్తుతం ఒక బంగీ జంప్ చేయాలంటే నిర్వాహకులు రూ 2,500 చెల్లించాల్సి ఉంటుంది. బంగీ జంప్‌తో పాటు ఫ్లయింగ్ ఫాక్స్‌కు కాంబో ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వయసు మీరిన వారి కన్నా, కుర్రకారులోనే ఈ బంగీజంప్, ఫ్లయింగ్ ఫాక్స్ జోరెక్కువగా కనిపిస్తోంది. చుట్టూ అందమయిన కొండలు.. వాటి లోయల్లో అంచుల వరకు దట్టంగా పరచుకున్న పచ్చదనం, ఆ కిందే పారుతున్న అందమయిన నది... ఒక బంగీ జంప్‌నకు ఇంతకన్నా కావలసిందేముంది?

గతంలో మనవారిలో కొందరికి బంగీ జంప్ చేయాలనుప్పటికీ, ఇక్కడ ఆ అవకాశాలు లేక, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి దేశాలకు వెళ్లి మరీ ఒక దూకు దూకి వచ్చేవారు. ఇపుడు అదే అవకాశం మనదేశంలో ఏర్పడటంతో వారిలో ఆనందం ఇంతా కాదు. నిజానికి, బంగీజంప్, ఫ్లయింగ్ ఫాక్స్ విన్యాసాలకు మనదేశంలో ఉన్నన్ని భౌగోళిక మద్దతులు వేరొక దేశంలో కనిపించవని సీనియర్ సాహస విన్యాసకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu