నాలుగు సంవత్సరాల పాటు మేఘాలయలో జరిగిన మద్యోత్సవం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఖాసీ ప్రజలు తయారు చేస్తున్న దేశవాళీ మద్యం మత్తుకు ఐరోపా దేశీయులు జోహార్లు పలుకుతున్నారు. స్థానిక ఉద్యానవన ఉత్పత్తులైన పండ్లు, అరటి పండ్లు, పీయర్స్, ప్లమ్స్, పైనాపిల్, స్ట్రాబెర్రీలు, గూస్‌బెర్రీలు, జాక్‌ఫ్రూట్ మరియు అల్లం తదితరాలకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఫరెవర్ యంగ్ స్పోర్ట్స్ క్లబ్ (ఎఫ్‌వైఎస్సీ) షిల్లాంగ్ మద్యోత్సవాన్ని నిర్వహించింది.
మేఘాలయాలో మద్యం తయారీ కుటీర పరిశ్రమగా వేళ్ళూనుకున్నది. ఈ నేపథ్యంలో మద్యోత్సవం పండ్ల మద్యాన్ని తయారు చేసే కుటీర పరిశ్రమకు జీవం పోసిందని మద్యం తయారీదారుడు జాన్ మారియో సోహ్‌టున్ అన్నారు. గడచిన కొద్ది సంవత్సరాలుగా మా యొక్క నిర్లక్ష్యం మూలంగా వేల రూపాయలు విలువ చేసే పండ్లను నేలపాలు చేశామని జాన్ తెలిపారు.
ఇక కేవలం దేశవాళీ మద్యాన్ని రుచి చూసేందుకు స్వీడన్‌కు చెందిన ఐయోనిస్ అనే పర్యాటకులు షిల్లాంగ్ చేరుకున్నారు. ఇప్పటివరకు ఈశాన్య భారతం తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రమని వార్తల ద్వారా తెలుసుకున్నాను. కానీ ఇక్కడకు రావడం ద్వారా అనేక రకాలు దేశవాళీ మద్యాలను రుచి చేసే అదృష్టం తనకు కలిగిందని ఐయోనిస్ అన్నారు.
షిల్లాంగ్‌లోని ప్రకృతి సోయగాల కన్నా స్థానికంగా తయారయ్యే తాజా మద్యాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టమని అమెరికాకు చెందిన బ్రిజిడ్ తెలిపారు. పర్యాటకుల ఆదరణకు ముగ్దుడైన మద్యం తయారీదారుడు జాన్ ఎంఎస్ ఖర్కోంగోర్ మద్యం తయారీని మేఘాలయ ప్రభుత్వం కుటీర పరిశ్రమగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.