మహేష్ కుమార్
భారతదేశం యొక్క స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ లేదా మడికేరి, కొడగు జిల్లా కేంద్రంగా బాసిల్లుతూ ఉన్నది. సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో ప్రభవించిన కూర్గ్, బెంగుళూరు నగరానికి 252 కి.మీ.ల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపై చిక్కటి అరణ్యాన్ని పాదుకున్న కూర్గ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
మంచును కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవి, ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు... ఊపిరి తీసుకోనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని విరామ విడిదిగా మడికేరి అలరారుతున్నది. అంతేకాదు... ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి.
శతాబ్ద కాలానికిపైగా చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థన మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు తమ సాయంత్రాలను ఇక్కడే గడిపేవారని వినికిడి. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
మడికేరిలో ప్రత్యేకించి సందర్శించవలసినదిగా నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం పేరొందినది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర సమస్త జంతు జాలాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి పూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఏర్పాటు చేశారు.
మడికేరి సమీపంలో పర్యాటకులను, సినీజనాన్ని అమితంగా ఆకర్షించే అబ్బీ జలపాతం, భాగమండల మరియు కావేరీ నదీ జన్మస్థానమైన తలకావేరీలు పర్వతాలతో ఆవృతమై నేత్రానందం కలిగిస్తున్నాయి.
ఇంకా సీతాదేవీని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టుట మరియు శిక్షణా కేంద్రమైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నదీ నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక మరియు సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యాటక స్థలాలు ప్రకృతి రమణీయతకు పట్టం కడుతున్నాయి.
చేరుకోవడానికి మార్గాలు
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడకు చేరుకోగలము. ఇక్కడకు రైలు మరియు విమాన సౌకర్యం లేదు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు మరియు తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం కలదు.
వసతి సౌకర్యాలు
సుందర పర్వత ప్రాంతమైన మడికేరిలో బస చేసేందుకు హోటళ్ళు ఉన్నాయి.