Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూలోక స్వర్గం కాశ్మీరంలోని "గుల్మార్గ్"

భూలోక స్వర్గం కాశ్మీరంలోని
ప్రస్తుతం మారణహోమాలు, హత్యలు, బాంబుదాడులు, ఎన్‌కౌంటర్లతో నెత్తురోడుతోందిగానీ... కొన్ని సంవత్సరాల క్రితం దాకా కాశ్మీరం యావత్ భారతీయులకే కాదు, ప్రపంచ యాత్రికులకు అదో కలల లోకం, భూలోక స్వర్గం. సహజ సుందర దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే అద్భుతమైన లోకమది. ఉద్యానవనాలు, సరస్సులు, మహోన్నతమైన మంచు పర్వతాలు, పచ్చిక బయళ్లు... ఓహ్, వర్ణణాతీతం.

ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచినది "గుల్మార్గ్" ప్రాంతం. ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఎన్ని విశేషణాలను ప్రయోగించినా గుల్మార్గ్ అందాల వర్ణన పూర్తవదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదుగుతూ వరుసలో నిలబడి పచ్చని చెట్లతో... భగవంతుడు గీసిన సుందర ప్రకృతి చిత్రానికి నిదర్శనంగా నిలుస్తుంది గుల్మార్గ్.

గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. పూలరంగులలో, రూపాలలో మహాద్భుతం ఇక్కడ తాండవిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేరు. జహంగీర్ చక్రవర్తి తన బహుభార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్గ్‌కి వచ్చాడట. ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చేందుకు సేకరించగా, ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయాయట.

గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చిక బయళ్ళు. గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం. ఇక్కడ 'టీ' చాలా ప్రసిద్ధి. కహనా అనే ఈ "టీ'లో బాదామ్‌, ఏలకులు, దాల్చినీ వేసి "బ్లాక్‌ టీ' తాగుతారు. ఇక్కడ అంతా మంచు వెనీలా ఐస్‌క్రీమ్‌ పరచినట్లు ఉంటుంది. మంచి నీళ్లు దొరకవు. మంచు వేడి చేసుకుని తాగాలి.

గుల్మార్గ్‌కి మంచులో స్కేటింగ్‌ చేసేందుకు విదేశీ టూరిస్టులు వస్తారు. ఆ మంచులో కాళ్లు వేస్తే మోకాళ్ల వరకు, కూరుకుపోతూ కొంత నడిచి, గండోలాలో రోప్‌ వే పైన మంచు కొండల మీదకి వెళ్లవచ్చు. ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు, ఎంబ్రాయిడరీ, జరీపని, తివాచీలు తయారు చేస్తారు. ఫాస్మిలాన్‌ అనే దారం రాట్నం మీద వడుకుతారు.

రంగుల దారాలు పెన్సిలంత కర్రలకి చుట్టి వరుసగా రంగుల కలయికలో ఉంచి, సంగీతంలో సరిగమల్లా (రంగుకి ఒక ఆకారం చప్పున) రాసుకుని అది చూసి షాల్స్‌ అల్లుతారు. హమ అనే ఊరిలో జరీపని కూడా చేస్తారు. ఈ జరీపనిని మావార్‌ అంటారు. పూర్వపురాజులు, బాద్‌షాలు తలపాగాలు, నడుంకి కట్టుకునే పట్టాలు, అంగీలు, జరీపనితో వున్నవి ధరించేవారట. జరీపని వున్న షాల్‌ నేయటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.

వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఒక్కర్‌వాల్‌ అంటే గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్తాన్‌ నుంచి గొర్రెల మందల్ని తెచ్చి గుల్‌మార్గ్‌, సోన్‌మార్గ్‌ల దగ్గరకొస్తారు. వాళ్లు మందల్ని తేవటం అంతా ఆర్మీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి చలికాలం రాగానే వెళ్లిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే... ఇక్కడి కొన్ని హిందూదేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా వున్నారు. ఆర్మీ యూనిట్లలో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాలు... అన్నీ ఒకే చోట వుంటాయి.

హాలిడే స్పాట్‌గా ఖ్యాతి గాంచిన ఈ గుల్మార్గ్ రిసార్ట్స్... ఎప్పుడు చూసినా యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడి కేబుల్ కార్ విహారం చక్కటి అనుభూతినిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్ క్రీడా మైదానం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్ క్రీడకు గుల్మార్గ్‌ని ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Share this Story:

Follow Webdunia telugu