ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్
ఎత్తైన కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, పచ్చిక బయళ్ళతో అలరించే ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్. భారతదేశంలో ఇంగ్లీషు అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమిది. బర్మా - టిబెట్ దేశాలకు చెందిన 16 జాతులకు చెందిన గిరిజనులు చిత్ర విచిత్ర వేషధారణలతో దర్శనమిచ్చి చూపరులను ఆశ్చర్యపరుస్తారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరుగాడే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు.జాతీయ రహదారిపై దిమాపూర్ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే నాగాలాండ్ రాజధాని కోహిమా చేరుకోవచ్చు. సముద్రమట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు చారిత్రక ప్రాధాన్యం ఎంతో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సేనలు కోహిమాను ఆక్రమించి, బసచేశాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల స్మృత్యార్ధం నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకుల కంటతడి పెట్టిస్తుంది. చూడాల్సిన ప్రదేశాలు నాగాల జీవన పద్ధతులను, చరిత్రనూ కళ్ళకు కట్టినట్టు చూపే స్టేట్ మ్యూజియం టూరిస్టులు చూడాల్సిన ప్రదేశాలలో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగలప్పుడు వాడిన అతిపెద్ద డ్రమ్(డప్పువాయిద్యం)ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులను ఒక ప్రత్యేకమైన హాలులో చూడవచ్చు. కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్ చర్చిని సందర్శిస్తే, చెక్కతో మలచిన ‘శిలువ’ దర్శనమిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద శిలువ. ఈ చర్చి కూడా పెద్దది.నాగాలాండ్‌కు కోహిమా రాజధానే అయినా, దాదాపు అంతటి ప్రాధాన్యం ఉన్న మరో నగరం దిమాపూర్. నాగాలాండ్ వాణిజ్య రాజధానిగా పేరొందిన దిమాపూర్- చుట్టుపక్కల ఉన్న మణిపూర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు దగ్గర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌లో ఉండటం మరో విశేషం. గతించిన కచారి రాజుల కాలం నాటి కట్టడాలు దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దిమాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుజాఫెమా మరో చక్కటి సందర్శనా క్షేత్రం. గిరిజనులు తయారుచేసే చిత్రవిచిత్రమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖొనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామ పరిసరాలు ఎక్స్‌కర్షన్లకు అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి పంట పండిస్తారంటే నమ్మశక్యం కాదు. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతోనూ, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతోనూ లోయ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.షాపింగ్ కోహిమా నగరం నడిబొడ్డున, బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సేల్స్ ఎంపోరియం నాగా చేతివృత్తుల ఉత్పత్తులకు ప్రసిద్ది. రంగురంగుల శాలువాలు, చేతిసంచీలు, చెక్కతో మలచిన బొమ్మలు, వెదురుబుట్టలు ఇక్కడ లభ్యమవుతాయి. ఎలా వెళ్లాలివిమానమార్గంనాగాలాండ్లో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్. కోల్‌కతా, గౌహతి నుంచి విమాన సౌకర్యం ఉన్నది.రైలుమార్గందిమాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరభారతంలోని పెద్ద పట్టణాలకు రైలు సౌకర్యం ఉన్నది. రోడ్డు మార్గందిమాపూర్ నుంచి కోహిమాకు టాక్సీలున్నాయి. గౌహతి, షిల్లాంగ్, కోహిమా నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.