మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి ఓ అందమైన ప్రకృతి నిలయం. దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశమైన ఈ ప్రాతం పర్యాటకులకు ఓ అందమైన అనుభూతిని సొంతం చేస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు గర్భవతిలా హటాత్తుగా వర్షిస్తుంటాయి.
సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటలర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్‌రామ్ ఉండడం విశేషం. దాదాపు ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకున్న కొత్త పెళ్లి కూతురిలా మనల్ని ఇట్టే కట్టి పడేస్తుంది.
షిల్లాంగ్ నుంచి చిరపుంజి ప్రాంతానికి పయనమైన వారికి చుట్టూ నిలుచున్న పర్వతాలు అత్యంత మధురానుభూతిని కల్గిస్తాయి. ఘాట్ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు.
చిరపుంజి ప్రాంతం దాదాపుగా లైమ్ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్‌రామ్ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు.
మేఘాలయలోని చిరపుంజిని చూడాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.
ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించి పోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. దేశంలోనే ఓ ప్రముఖ హిల్ స్టేషన్‌గా ఉన్న షిల్లాంగ్ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.
వసతి సౌకర్యాలు
షిల్లాంగ్ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలతో పాటు చిరపుంజి లాంటి ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా షిల్లాంగ్ నుంచి పయనం సాగించాల్సిందే. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల వసతి సౌకర్యాలు షిల్లాంగ్‌లో లభిస్తాయి. షిల్లాంగ్‌లో సాధారణ స్థాయి సౌకర్యాలనుంచి ఓ మోస్తరు ఆధునిక వసతుల వరకు అందుబాటులో ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
షిల్లాంగ్ చేరుకోవాలనుకునే వారికి సమీపంలోని గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది.
గౌహతినుంచి షిల్లాంగ్ వెళ్లే వారికోసం మేఘాలయా ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాలయాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నా అక్కడినుంచి రాజధాని ప్రదేశమైన షిల్లాంగ్‌కు బస్ సౌకర్యం ఉంది.