Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కొల్లి' పర్వత ప్రాంతంలో "బొటానికల్ గార్డెన్"

Advertiesment
'కొల్లి' పర్వత ప్రాంతంలో
తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన "కొల్లి" పర్వత ప్రాంతంలోని పసలూర్ పట్టిలో కొత్తగా ఓ "బొటానికల్ గార్డెన్"ను ఏర్పాటు చేశారు. "వల్‌విల్ ఓరి" పండుగను పురస్కరించుకుని ప్రజల సందర్శనార్థం త్వరలోనే ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారు.

ఊటీలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బొటానికల్ గార్డెన్‌లో మాదిరిగానే... వివిధ రకాల పూల మొక్కలు, వివిధ డిజైన్లతో కూడిన వృక్ష సముదాయాలను ఈ కొల్లి గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. కొల్లి పర్వత ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు నామక్కల్ జిల్లా యంత్రాంగం 62 లక్షల రూపాయల వ్యయంతో ఈ బొటానికల్ గార్డెన్‌ నిర్మాణ పనులు చేపట్టింది.

ఆయుర్వేదానికి అత్యంత ప్రసిద్ధి చెందిన "వల్‌విల్ ఓరి" వంటి అంశాలను కూడా ఈ గార్డెన్‌లో మేళవించారు. ఈ విషయమై నామక్కల్ జిల్లా కలెక్టర్ సగయాం మాట్లాడుతూ... ప్రకృతిపరమైన, స్వచ్ఛమైన అందాలను తిలకించేందుకు కొల్లి పర్వత ప్రాంతాలు అనువుగా ఉంటాయని అన్నారు.

కొల్లి బొటానికల్ గార్డెన్‌లో... పచ్చదనంతో కూడిన గుడిసెలు, వెదురుతో తయారు చేసిన గృహాలు, గ్లాస్‌తో తయారు చేసిన గృహాలు, హెర్బల్ ఫాం, గులాబీ గార్డెన్, చిన్నారుల కోసం ప్రత్యేకమైన క్రీడా మైదానాలు కూడా అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. అంతేగాకుండా, పర్యాటకులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకుగానూ ఆధునిక టెక్నాలజీతో కూడిన మౌలిక సదుపాయాలను కూడా ఇక్కడ మెండుగా కల్పించినట్లు సగయాం పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu