Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వజ్రాల వాణిజ్య కేంద్రం సంబల్‌పూర్

వజ్రాల వాణిజ్య కేంద్రం సంబల్‌పూర్

Pavan Kumar

, శనివారం, 7 జూన్ 2008 (16:58 IST)
ఒరిస్సాలో వజ్రాల వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది సంబల్‌పూర్. పశ్చిమ ఒరిస్సాలో మహానది ఒడ్డున ఉంది సంబల్‌పూర్. సంబల్‌పూర్ చరిత్ర ఈ నాటిది కాదు. సంబల్‌పూర్ సమీపంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో వజ్రాలు దొరికేవి. వీటిని సంబల్‌పూర్‌కు తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరిపేవారు.

సంబల్‌పూర్ అనే పేరు స్థానిక దేవత సామలేశ్వరి పేరు మీద వచ్చింది. శక్తి అవతారాల్లో ఒకటిగా సామలేశ్వరిని భక్తులు కొలుస్తారు. సంబాలక్, బీరాఖండా, దక్షిణ కోసల వంటి పేర్లు సంబల్‌పూర్‌కు ఉన్నాయి. సంబల్‌పురి అనే మాండలిక ఒరిస్సా భాషను ఇక్కడవారు మాట్లాడతారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నివసించే గిరిజన ప్రజల ప్రభావం సంబల్‌పూర్ మీద ఉంది.

సంబల్‌పూర్‌కు ప్రాచీన చరిత్ర కూడా ఉంది. సంబల్‌పూర్ దక్షిణ కోసలలో భాగంగా ఉండేది. సంబల్‌పూర్‌ను పరిపాలించిన రాజా ఇంద్రభూతి ఇక్కడ వజ్రయాన బౌద్ధమతం వ్యాప్తికి కృషి చేశాడు. కళింగ సామ్రాజ్య చక్రవర్తి ఖారవేలుడు సమయంలో ఈ ప్రాంతాన్ని అత్తాభికగా పిలిచేవారు. కళింగ-ఉత్కళ సామ్రాజ్యానికి చెందిన సామంతులైన సోమ, గంగ, సూర్య, గజపతి రాజులు సంబల్‌పూర్‌ను పరిపాలించారు.

చూడవలసిన ప్రాంతాలు
సామలేశ్వరి దేవాలయం
సంబల్‌పూర్‌లో మహానది ఒడ్డున ఉంది సామలై గుడి. ఈమెను శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు.

బుద్ధరాజ దేవాలయం
మహాశివుని దేవాలయం బుద్ధరాజ మందిరం. స్థానికంగా ఉన్న బుద్ధరాజ కొండపై ఈ దేవాలయం ఉంది.

హీరాకుడ్ ఆనకట్ట
మహానదిపై నిర్మించిన ఆనకట్ట. ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట హీరాకుడ్. లాండుంగ్రీ, ఛాండిలీ డుంగ్రీ కొండల మధ్య 26 కి.మీ. మేర పొడవునా హీరాకుడ్ బహుళార్ధ సాధక పథకాన్ని 1956లో నిర్మించారు. ఆనకట్ట వెనుక 55 కి.మీ.పొడవైన సరస్సు ఉంది. స్వతంత్ర భారతదేశంలో తొలి బహుళార్ధ సాధక పథకం ఇదే. సంబల్‌పూర్ నగరానికి 16 కి.మీ. దూరంలో ఉంది హీరాకుడ్ ఆనకట్ట.

ఉషాకోఠి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
సంబల్‌పూర్‌కు 48 కి.మీ. దూరంలో బద్రామాలో ఉంది ఉషాకోఠి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం. దట్టమైన అడవుల్లో ఏనుగులు, పులులు, జింకలు, అడవి పందులు వంటివి ఉన్నాయి.

ఛిప్లిమా జల విద్యుత్ కేంద్రం
మహానదిపై నిర్మించిన మరో జల విద్యుత్ కేంద్రం ఛిప్లిమా. సంబల్‌పూర్‌కు 36కి.మీ. దూరంలో ఉంది ఛిప్లిమా. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం కూడా ఉంది.

సంబల్‍‌పూర్ హస్తకళలు, చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ సంబల్‌పురి పేరుతో చీరలు తయారవుతాయి. స్థానిక చేనేత ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంది.

వసతి
అన్ని తరగతుల వారికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : భువనేశ్వర్ (325 కి.మీ.), రాయ్‌పూర్ (300 కి.మీ.)
రైలు మార్గం : సంబల్‌పూర్‌లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి చెన్నై, ముంబయి, కోల్‌కతా, హౌరా, భువనేశ్వర్‌లకు నేరుగా రైళ్లు ఉన్నాయి. సమీపంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ ఝార్సూగూడా (48 కి.మీ.). ఇది హౌరా-ముంబయి ప్రధాన రైలు మార్గంలో ఉంది.
రహదారి మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సేవలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu