Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న కుట్రాలం జలపాతాలు

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న కుట్రాలం జలపాతాలు
, గురువారం, 6 అక్టోబరు 2011 (18:35 IST)
ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

అందుకే వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇంతగా పర్యాటకులకు ఇష్టమైన జలపాతాలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అలా ఆధ్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాంతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.

కుట్రాలంలోని విశేషాలు
కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి. కుర్తాలంలోని శివలింగాన్ని పురాణకాలంలో అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.

కుర్తాలంలోని ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్పసంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. కుర్తాలంలోని కుర్తాల నాదర్‌గా వెలసిన పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు.

ఈమెతో పాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలసినా ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరగడం ఓ విశేషం.

జలపాతాల నెలవు కుట్రాలం:
కుట్రాలంలో కుట్రాల నాదర్ స్వామి తర్వాత మనల్ని మరింత పులకరింపజేసేది ఇక్కడ ఉన్న జలపాతాలు. పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్ ప్రాంతంలో పుట్టిన చిత్తరువి అనే నది కొండ కోనల్లో ప్రవహిస్తూ తన ప్రధాన నది అయిన శివలప్పెరి అనే నదిలో కలిసేముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా ప్రవహిస్తుంది.

అత్యంత అద్భుతంగా కానవచ్చే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాద ప్రదేశాల్లో జాలువారే కారణంగా కొన్నిచోట్ల మాత్రమే పర్యాటకులు జలపాతాల్లో స్నానం చేయడానికి అనుమతిస్తారు. కుర్తాలంలోని జలపాతాల్లో తనివితీరా స్నానం చేసేందుకు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటుంది.

కుట్రాలం ప్రాతంలో జాలువారే ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుర్తాల నాదన్ ఆలయానికి సమీపంలోనే ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. కుట్రాలంలోని జలపాతాల్లో సిత్తరవి అనే జలపాతం పర్యాటకులు స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు.

కుట్రాలంలోని మరో జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దదైన ఈ జలపాతం ఐదు పాయలుగా క్రిందికి జాలువారుతుంటుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ జలపాతం వద్ద కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.

కుట్రాలంలోని మరో జలపాతమైన టైగర్ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జలపాతం పైనుంచి జాలువారుతుంటే దాని శబ్ధం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి టైగర్ ఫాల్స్ అనే పేరువచ్చింది. ఈ జలపాతంలో సైతం పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవేకాకుండా కుట్రాలంలో ఇతర జలపాతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

రవాణా సౌకర్యాలు
తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్‌కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్‌కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu