అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!
కనులు తిప్పుకోనీయని అందాలు అజంతా సొంతం. అజంతా, ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు తార్కాణం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. అజంతా ఎల్లోరా గుహల అందాలను, అక్కడి శిల్పసౌందర్యాన్ని ఓసారి పరికిద్దాం. ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలు పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉంటాయి. 1819లో జాన్‌స్మిత్ అనే బ్రిటీషు అధికారి వీటిని గుర్తించాడు. ఇక్కడ మొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలను ఎక్కడి నుంచైతే చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింటుగా చెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకు గల దారి గుర్రపు నాడాలా సన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి.పెయింటింగులతో నిండి ఉండే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గుహల పైకప్పు, పక్కభాగాలలో బుద్ధుని జీవిత విషయాలను చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విషయాలను వర్ణించే చిత్రాలు ఉంటాయి. ఈ చావడికి ఎడమవైపున ఉన్న హాలులో వేటగాడు పన్నిన వలనుంచి పావురాన్ని రక్షిస్తున్న శిబిచక్రవర్తి చిత్రం, జాతక కథలు ఉన్నాయి. రెండో గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రించారు. దాని పైకప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో బాగుంటుంది. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు వంటి వాటిని కూడా చిత్రించారు. 16వ నెంబరు గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2-7 శతాబ్దాల మధ్య కాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది. ఎల్లోరా గుహలు ఎల్లోరా గుహలను రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారట. ఔరంగాబాద్‌కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి ఆ తరువాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారట. ఇక్కడ మొత్తం 34 గుహలుంటాయి. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చనీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లో జైనుల గుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్ సైట్లుగా కూడా గుర్తించింది. అయితే వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.