శివుడు లింగోద్భవమూర్తి ఎలా అయ్యాడు..? మహాశివరాత్రి పర్వదినం గురించి?
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2014 (17:47 IST)
సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున 'శివరాత్రి' వస్తూనే ఉంటుంది. దానిని మాసశివరాత్రిగా పిలుస్తారు. అయితే మాఘ బహుళ చతుర్దశినాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రి పార్వతీపరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైనది. శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ || ఇట్టి మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వాంత ర్యామియై ఈ చరాచర ప్రపంచం అంతట వ్యాపించి ఈ సహజ లక్షణాలతో ఆయన నిరాకారుడయ్యాడు. కాని భక్తులను అనుగ్రహించేందుకు, ఆశీర్వదించేందుకు, సగుణాకార, నిర్గుణాకారాల ప్రతిరూపమే ఈ శివలింగ రూపమని, మిగిలిన దేవతలవలె ప్రతీకగా, లింగపూజను నిరాకార ఆరాధనగా చేస్తూ ఉంటారని దైవజ్ఞులు చెబుతారు. ఇక ఈ ఈశ్వరుడు లింగోద్భవమూర్తిగా అవతరించుటగల కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. దీనికి ఒక పురాణగాథ కలదు. ఒకసారి బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంత గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగినారు. వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మాఘమాసం చతుర్దశినాడు వారి ఇరువురుకు మధ్య జ్యోతిర్లింగంగా రూపుదాల్చాడు. వారు ఇరువురు ఆలింగంయొక్క ఆది అంతాలకు తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూవెళ్ళగా, బ్రహ్మదేవుడు హంసరూపందాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణువేడుకుంటారు. అప్పుడు ఆ పరమ శివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టినాడు. దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వానికి విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యింది.