శివాలయం వెళ్తున్నారా..? ముందు నందీశ్వరుని దర్శించుకోండి
మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే భక్తులు ముందు నందీశ్వరుడిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. శివభగవానుడు జ్ఞానదేవుడు. జ్ఞానికి మాత్రమే పరుల దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. విషరూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించనీయకుండా కంఠంలోనే అదిమిపెట్టి బంధించగల పరమేశ్వరుడే.. ఆదిశంకరుడు. అలాంటి మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆలయాల్లో దర్శించుకునేవారు ముందు నందీశ్వరునికి ప్రణమిల్లి నమస్కరించాలని పురోహితులు అంటున్నారు. శివమందిరములో ప్రవేశిస్తుండగా, శివుని వాహనమైన నంది భగవానుడితో తమ కోరికలను వృషభుడి చెవిలో చెప్పుకుంటే.. శుభప్రదంగా పూర్తవుతాయని విశ్వాసం.సాధారణంగా ఎద్దుకు బుద్ధి చాలా తక్కువగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ భగవంతుని లేదా భగవత్‌జ్ఞానాన్ని మస్కిష్కంపై మోసుకుని మానవుడు విశ్వంలో పురోగమించగలిగితే సామాన్య బుద్ధిగల ఎద్దు కూడా మహా మహా విద్వాంసులను కూడా ఓడించగలుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్చంచబడుతుందని పండితుల వాక్కు.అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళే భక్తులు ముందు నందీశ్వరుడిని పూజించి, ఆయనకు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇంకా మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా శివదేవుని పైన సదా వ్రేలాడుతుండే అభిషేక పాత్ర నుండి జరిగే అభిషేకం లేదా ఆ పాత్ర నుంచి వెలువడే జలబిందువులు సాతత్యాన్ని సూచిస్తాయి. ఇలా భగవంతునిపై మన అభిషేకం నిరంతరం కొనసాగాలనే పరమార్థాన్ని ఈ అభిషేక పాత్ర సూచిస్తోంది. అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే అభిషేకం, పూజల్లో పాలుపంచుకుని ఆ హరహర మహాదేవుని అనుగ్రహాన్ని పొందుదుముగాక..!