"లింగోద్భవకాలం"లో ఎలాంటి పూజలు చేయించాలంటే..?
శివునికి సంబంధించిన పండుగలన్నింటిలోనూ అనంత పుణ్యప్రదమైనది "మహాశివరాత్రి". ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇలా మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశికి "మహాశివరాత్రి" అని పేరు. అట్టి మహిమాన్వితమైన రోజునే జ్యోతిర్లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శివపద మణిమాలలో 'శి' అనగా శివుడనియు, 'వ' అనగా శక్తి స్వరూపమని చెప్పబడి ఉంది. ఈ శివరాత్రినాడు విశేషమైన కాలం "లింగోద్భవకాలం" ఆ రాత్రి 11.30 నుండి 01.00 గంటల వరకు అని పురోహితులు అంటున్నారు. ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీని జపిస్తూ, ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోనూ, రెండో జాము నందు తేనెతోను అర్చిస్తే ఉమామహేశ్వరుల అనుగ్రహం పొందుతారని విశ్వాసం. అలాగే మహాశివరాత్రి నాడు లక్షబిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని, మొగలిపూవులతో శివారాధన చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతికొరకై స్వీకరించి వారికి వెయ్యి అశ్వమేధ యాగాలను చేసినంత ఫలం లభించి, శివసాయుజ్యము లభిస్తుందని పండితులు చెబుతున్నారు.అందుచేత ఇంతటి విశిష్టమైన "మహాశివరాత్రి" పర్వదినాన సమీప శివక్షేత్రాల్లో విశేషార్చనలు జరిపించి మనమందరం పునీతులౌదాం..