మహాశివ రాత్రి : శివనామస్మరణలో భక్తులు
, గురువారం, 27 ఫిబ్రవరి 2014 (15:45 IST)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ముఖ్య శివాలయాలైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి కాళేశ్వరుడు, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, ద్రాక్షారామం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ పర్వదినం రోజున శివుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సఖ్యల క్యూలో వేచి ఉన్నారు. దీంతో శ్రీశైలంలో దర్శనం కోసం 10 గంటల సమయం పడుతోంది. అలాగే, శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలైన సామర్లకోట, ద్రాక్షారామం భక్తజనసంద్రంగా మారింది. ఇదిలావుండగా, మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి వారిని కేంద్ర మంత్రి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పురంధేశ్వరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.