కర్నూల్: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు కన్నుల పండుగగా వీక్షించనున్నారు. నిత్యం దేవస్థానం అధికారులు, ప్రధాన అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవ క్రతువులకు శ్రీకారం చుడుతున్నారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గణపతి పూజ, శివసంకల్పం, కంకణపూజ నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, రాత్రి 7గంటలకు త్రిశులా పూజ, భేరిపూజ, ధ్వజారోహణ నిర్వహించారు. రెండో రోజు మంగళవారం నేటి నుంచి రోజువారీ వాహన సేవలు, గ్రామోత్సవ నిర్వహిస్తారు. వాహన సేవల్లో వరుసగా మార్చి1న భృంగి వాహన, 2న హంస వాహన, 3న మయూర, 4న రావణ, 5న పుష్పపల్లకి, 6న గజవాహనం 7న శివరాత్రి రోజు నందివాహన, 8న రథోత్సవం, 9న పూర్ణాహుతి, 10న అశ్వ వాహన సేవలు జరుగుతాయి
బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నలుమూలాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉభయ దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.