భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలంటే.. కొద్ది సమయంలోనే విలువైన మాటలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇద్దరి అభిరుచులను తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోండి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడకండి.
ఏదైనా కారణం వల్ల ఎదుటివారిని కోపగించుకోవడం, చికాకు ప్రదర్శించడం, అభిప్రాయభేదాలు లాంటివి అనుబంధంలో సహజమే. అలాంటప్పుడు భాగస్వామితో పూర్తిగా మాట్లాడటం మానేయడం, కొన్నిరోజులు దూరంగా జరగడం సబబు కాదు. ఆ సందర్భం వల్ల మీకు కలిగిన అసౌకర్యాన్ని పంచుకోండి. అవతలి వారిలో మంచిని చూడండి. అది దూరాన్ని తగ్గిస్తుంది.
ఇక రోజంతా ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కాసేపు భాగస్వామికి దగ్గరగా గడపండి. అంతేతప్ప ఆ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. అలాగే ఇద్దరిమధ్యా అనుబంధం పెరిగేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా మీ ప్రేమను వ్యక్తం చేయండి.
అది ఫోన్లో కావచ్చు. నేరుగా చెప్పినా సరే. ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం రెండు నిమిషాలైనా మీ భాగస్వామితో మాట్లాడండి. దానివల్ల మీరు వారిని పట్టించుకున్నారనే సంకేతం పంపినవాళ్లవుతారు. అది భార్యాభర్తల మధ్య గల అనుబంధాన్ని పెంచినట్లవుతుంది.